శుక్రవారం రోజున పెళ్లి జరిపిస్తున్నారా ?

VAMSI
మన ఆచార వ్యవహారాలను నమ్మేవారికి, వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటించే వారికి కొన్ని ధర్మ సందేహాలు కలుగుతుంటాయి. వాటిలో ఒకటి శుక్రవారం రోజున పెళ్లి జరిపించ వచ్చా ? ఒకవేళ జరిపిస్తే కూతురిని శుక్రవారం రోజు అత్తారింటికి పంపవచ్చా ? అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. కొందరికి అనుకోకుండా శుక్రవారం రోజు పెళ్లి ముహూర్తాలు కుదురుతుంటాయి. అలాంటి వారికి ఈ సందేహం కలుగుతుంది. సాధారణంగా వివాహం అనంతరం అదే రోజున అమ్మాయి పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న మన సాంప్రదాయం. అయితే పెళ్లి వేడుక శుక్రవారం వచ్చినప్పుడు, మహాలక్ష్మి స్వరూపమైన అమ్మాయిని మన ఇంట్లో నుండి అత్తవారింటికి పంపమంటే, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మినే మన ఇంటి నుండి వారి ఇంటికి పంపినట్లే అవుతుంది.
అయితే అలాగని శుక్రవారం నాడు వివాహం చేయకూడదని కాదు. ఎవరికైతే శుక్రవారం రోజున వివాహం జరుగుతుందో, అటువంటి వారు వారి అమ్మాయిని అదే రోజున మెట్టినింటికి పంపే ముందు ఈ జాగ్రత్త వహిస్తే అంతా మంచే జరుగుతుంది. వారి అత్తింటి వారిని మీ గడపపై ఎంతో కొంత బంగారపు వస్తువును పెట్టి అమ్మాయిని వారి ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పాలి. బంగారం మహాలక్ష్మి స్వరూపం అలాంటి బంగారాన్ని మన ఇంటి గడపపై పెట్టి  అమ్మాయిని తీసుకు వెళ్లడం వలన ఇటు మన ఇంట్లోకి బంగారం రూపంలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అటు వారి ఇంట్లోకి మహాలక్ష్మి  నవ వధువుగా అడుగు పెడుతుంది.  
శుక్రవారం నాడు కూతురికి పెళ్లి చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపేవారు ఇలా చేయడం ద్వారా ఇరు కుటుంబాలకు  అంతా శుభమే జరుగుతుంది అంటున్నారు పండితులు. కాబట్టి మీకు కానీ లేదా మీ బంధువులలో కానీ ఇలాంటి సందర్భాలు ఎదురైతే ఈ విధంగా చేయమని సలహా ఇవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: