తిరుమల శ్రీవారికి ఎంతటి దుస్థితి..?

నిత్య కల్యాణం, పచ్చతోరణం.. తిరుమల శ్రీవారి ఆలయానికి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. స్వామివారి నిత్య కల్యాణాలతో, భక్త జన సందోహంతో.. తిరుమల గిరులు నిత్యం కిటకిటలాడేవి. కరోనా కారణంగా భక్తుల సాధారణ దర్శనాలకు బ్రేక్ పడటంతో.. అన్ని సేవలూ ఏకాంతంగానే మారాయి. అలాంటిది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా భక్తులు లేకుండా, హడావిడి లేకుండా మొదలయ్యాయి. వాహన సేవలు చూసేందుకు రెండు రోజుల ముందుగానే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. ఊరేగింపు మొదలయ్యే సమయానికి కొన్ని గంటల ముందే మాడ వీధులన్నీ కిక్కిరిసిపోతాయి. భక్తులతోపాటు, ఉత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాది ఈ సందడందా మటుమాయమైపోయింది.
మాడవీధులు బోసిపోయాయి, స్వామివారి ఉత్సవాలు చూసేవారే కరువయ్యారు. కొవిడ్ నిబంధనల కారణంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భక్తులెవరినీ అనుమతించలేదు. శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనా.. భక్తుల సందడి లేక వెలవెలబోయాయి. అద్దాల మండపంలో పుట్టమన్ను సేకరించి శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఈ సారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గుడి ప్రాకారం లోపలే బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. టీటీడీ బోర్డు చరిత్రలో ఇలా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈనెల 23న గరుడసేవ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శ్రీవారి భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 23న సాయంత్రం గరుడ వాహనసేవకు ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం వైఎస్‌ జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారని, 23 నాడు సాయంత్రం 7 గంటలకు కర్ణాటక సీఎం యడియూరప్ప తిరుమల చేరుకుంటారని తెలిపారు సుబ్బారెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: