హెరాల్డ్ స్పెష‌ల్‌... సీత్లా భ‌వాని పండుగ‌

Spyder

లంబాడ గిరిజ‌నులు ఎంతో ప‌విత్ర‌తో జ‌రుపుకునే పండుగే  సీత్లా భ‌వాని వేడుక‌. గిరిజ‌న సంప్ర‌దాయంలో లంబాడీలు జ‌రుపుకునే తొలి పండుగ కూడా ఇదే. ప్ర‌కృతిని ఆరాధిస్తూ..కొలుస్తూ పంట‌ల‌ను, ప‌శుసంప‌ద‌ను, త‌మకు ఆయురారోగ్యాల‌ను ప్ర‌సాదించాల‌ని వేడుకుంటూ నిర్వ‌హిస్తుంటారు. ఈ పండుగ‌కు బోనాల వేడుక‌లకు సామీప్య‌త ఉండ‌టం గ‌మ‌నార్హం. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం.  తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశుసంపద పెరగాలని, దూళ్ళకు పాలు సరిపోను ఉండాలని గడ్డి బాగా దొరకాలని క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని అటవీ సంపద తరగకూడదని, సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకుంటారు.


సీత్ల భవాని పండుగ ప్రపంచం మొత్తంలో నివసిస్తున్న లంబాడీలు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ. ఇలాంటి పండుగ తెలుగు పండుగల్లో ఎక్కడ చూసినా కనిపించదు. ఇది బంజారా ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. పంట పొలాలు సాగుచేసే క్రమంలో తొలిసారిగా వారి పండుగ ఆరంభమవుతాయి. హిందూ పండుగల్లో ఉగాది తొలి పండుగ ఎలా ఉందో అలాగే సీత్ల భవాని పండుగ బంజారాలకు తొలి పండుగ. ఈ పండుగను వివిధ తండాల్లో ఆ తండా ప్రజలు పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢమాసంలో ఒక మంగళవారం ఎంచుకొని సీత్ల పండుగను జరుపుతారు. ఇలా ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం రోజు మాత్రమే జరపడం ఈ పండుగ ప్రత్యేకత, ఆనవాయితీ. 

 

లంబాడీల పండుగలో మొదటిది, ప్రధానమైనది దాటుడు, సీత్ల పండుగ. తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవానిని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు మేకలతో, మహిళలు, యువతులు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశానికి వెళ్తారు.. ఈ క్రమంలో అందరు కలిసి పాటలు పాడుతారు. సీత్ల భవాని దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు మేకలను బలి ఇచ్చి వాటిని పైనుంచి పశువులను దాటిస్తారు. అలా చేయడం వల్ల పిల్లాజెల్లా ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండుతాయని బంజారా నమ్మకం. 

 

దేవతను పూజించే క్రమంలో పెద్ద మనిషిని పూజారిగా ఉంచి అతని చేతుల మీదగా కార్యక్రమం నిర్వహించడం బంజారాల ఆచారం. ఎక్కువ పశు సంపద వృద్ధి చెందాలనీ, తండా ప్రజలందరినీ దేవత సల్లగా ఉండేలా దీవించాలనీ, పశువులకు ఎటువంటి రోగాలు రాకూడదనీ, ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలనీ తండావాసులు వారి పశువులను ఒకేచోట చేర్చి అందరూ కలిసి భవాని దేవతను పూజిస్తారు. తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశుసంపద పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, అటవీ సంపద తరగకూడదని మొక్కులు తీర్చుకుంటారు. పశు సంపద కోసం, పశువుల ఆరోగ్యం కోసం తండా సౌభాగ్యం కోసం సీత్ల భవాని పూజ చేయడం ఆనవాయితీ. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: