స్మరణ : అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ వేణుమాధవ్ ను ఏమని పిలిచేవారో తెలుసా ?
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటులు అడుగు పెడుతూనే ఉంటారు. అయితే అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోతారు. అలాంటి వారిలో ఒకరు కమెడియన్ వేణుమాధవ్ కూడా.. తక్కువ సినిమాలలో చేసినప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నిజానికి వేణుమాధవ్ 1969 సెప్టెంబర్ 28 న సూర్యాపేట జిల్లా కోదాడ లో జన్మించాడు. ఈయన తండ్రి ప్రభాకర్, తల్లి సావిత్రి. ఇక నాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో లైన్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తుంటే, అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేసేది. ఇక వేణుమాధవ్ ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు మొత్తం తెలుగు మీడియంలోనే కోదాడలోనే కంప్లీట్ చేశాడు.
వేణుమాధవ్ చదివింది మొత్తం తెలుగులోనే కాబట్టి, తనకి ఇంగ్లీష్ పెద్దగా రాదు అని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చేవాడు . ఇక తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం అని, ఏ చిన్న సందర్భం వచ్చినా డాన్స్ చేసి అందర్నీ అలరించేవాడట.అంతేకాకుండా తను నాలుగో తరగతి చదువుతున్నప్పటి నుంచే మిమిక్రీ చేయడం ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయులను అనుకరించి, అందరినీ నవ్వించే వాడు..
ఈయనకు వెంట్రిలాక్విజం మీద బాగా ఆసక్తి ఉండేది. అదే ఆసక్తితో బాంబే నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. ఇక అంతే కాకుండా కోదాడలో మొట్టమొదటిసారిగా వెంట్రిలాక్విజాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన చదివే కళాశాల ప్రిన్సిపాల్ ని కలిస్తే, వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసన సభ్యులు చందర్ రావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం కూడా జరిగింది. ఇక ఆ ప్రదర్శనకు ఆయన ఎంతో ముచ్చటపడి భువనగిరి లో ఆయన పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు.
ఇక ఆ మీటింగ్ కు హాజరైన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి కీ.శే. ఎలిమినేటి మాధవరెడ్డి కూడా వేణుమాధవ్ ను నల్గొండ పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఇక ఆ ప్రదర్శనలో చంద్రబాబు నాయుడు చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. అలా సభ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ వేణు దగ్గరకు వచ్చి, మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్ అని చెప్పి, చంద్రబాబు నాయుడు వైపు తిరిగి వీరిని మనతోపాటే ఉంచండి అని అన్నాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమయ్యారు. ఇక ఆ పరిచయంతోనే వేణు హిమాయత్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు . వేణుమాధవ్ బొమ్మతో మిమిక్రీ చేసేవాడు కాబట్టి ఎన్టీఆర్ వేణుమాధవ్ ను బొమ్మ గారూ!అని ఆప్యాయంగా పిలిచేవారు..
ఇక అసెంబ్లీ లో లైబ్రరీ అసిస్టెంట్ గా పని చేసేటప్పుడు ఖాళీ సమయంలో ఎదురుగా ఉన్న రవీంద్రభారతి కి వెళ్ళడం అలవాటయ్యింది.. అలా రవీంద్రభారతి వేదికపై ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. అందులో ఆయన చేసిన కామెడీ స్కిట్, అతని జీవితాన్ని మార్చేసింది. అలా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు వేణుమాధవ్. ఇక అంతే కాదు తన నటనకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ, స్టార్ కమెడియన్ గా ఎదిగిన వేణుమాధవ్ కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2019 సెప్టెంబర్ 25న మరణించాడు.