కాంగ్రెస్ కహానీ: బాబోరి రేవంత్.. మరో వైఎస్సార్ ?
అయితే.. వైఎస్ పాదయాత్ర.. ఆ తర్వాత కాంగ్రెస్ గెలుపుతో సీన్ మారిపోయింది. అప్పటి వరకూ ప్రాంతీయ నేతలను ఆడించిన హైకమాండ్.. వైఎస్సార్ రాకతో ఆయన మాట వినకతప్పని స్థితి ఏర్పడింది. వైఎస్‌ను కాదని ఏమీ చేయలేకపోయింది. వైఎస్సార్ మరణం తర్వాత మళ్లీ కాంగ్రెస్ పూర్వ స్థితికి చేరుకుంది. బలమైన నాయకుడు లేక.. మళ్లీ హైకమాండ్ చేతుల్లోకి వెళ్లింది. పొన్నాల, ఉత్తమ్ వంటి నేతల హయాంలో కాంగ్రెస్ మళ్లీ ప్రభావం కోల్పోయింది.
ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ వచ్చాక.. మళ్లీ వైఎస్సార్ తరహాలో పార్టీని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదల కనిపిస్తోంది. రేవంత్ వచ్చాక మళ్లీ కాంగ్రెస్‌లో జోరు పెరిగింది. వరుసగా సభలు నిర్వహిస్తూ పార్టీలో ఉత్సాహం నింపుతున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ నుంచి వలసలు ఆగాయి. పార్టీ కార్యక్రమాలు పెరిగాయి. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమో అన్నంతగా హైప్ క్రియేట్ అవుతుంది. అయితే.. గతంలో వైఎస్సార్‌లా రేవంత్ రెడ్డి పూర్తిగా పార్టీని తన చేతుల్లో ఉంచుకోగలుగుతారా అంటే అవునని చెప్పలేని స్థితి.
రేవంత్‌ను ఇంకా ఓటుకు నోటు కేసు వేటాడుతూనే ఉంది. అటు కాంగ్రెస్‌లో సీనియర్లు ఇంకా సహాయ నిరాకరణ చేస్తూనే ఉన్నారు. దీనికితోడు పరిమితికి మించిన తిట్లతో రేవంత్ కూడా హుందా కోల్పోతున్నారు. ఇప్పటికీ చంద్రబాబు అనుకూలుడుగా పేరున్న రేవంత్ తన ఇమేజ్ అమాంతం మార్చుకుంటారా.. కాంగ్రెస్‌లో మరో వైఎస్సార్ అవుతారా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.