హలో ఈటల.. అప్పుడే ఇలాగైతే ఎలా..?
అవును అవతల ఉన్నది మామూలు వ్యక్తి కాదు.. కదా.. ఈటలను ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డుతారన్న విషయం ఈటల కు తెలియంది కాదు. అందుకే తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే పాదయాత్ర చేస్తున్న ఈటల నిన్న అనారోగ్యం బారిన పడ్డారు. అస్వస్థతకు గురయ్యారు. బీపీ, సుగర్ లెవల్స్ పడిపోయాయి. లో బీపీకి గురయ్యారు. వీటికి తోడు కాళ్ల నొప్పులు, జ్వరం వేధిస్తున్నాయి. దీంతో ఆయన అకస్మాత్తుగా పాదయాత్రకు విరామం ఇచ్చేశారు.
ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చేశారు. ఆయన కోలుకున్నాకే మళ్లీ పాదయాత్ర మొదలయ్యేది.. ఈటల పాదయాత్ర 222 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత బ్రేక్ పడింది. మరి ఇలాగైతే.. ఆయన పాదయాత్ర ఎప్పుడు పూర్తవుతుంది. పాదయాత్రకు ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా.. ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే ఈటల ఎందుకు అస్వస్థతకు గురయ్యారు.. వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేవలం అస్వస్థతే కాదు.. ఈటలను ఇంకా అనేక అంశాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన బంధువుల పేరుతో బయటపడిన వాట్సప్ చాట్ ఆయన్ను అప్రదిష్ట పాలు చేస్తోంది. అది ఫేక్ అని వారు మొత్తుకుంటున్నా అది జనంలోకి వెళ్లిపోయింది. ఇలాంటి తప్పటడుగులు పడితే ఈటల కేసీఆర్‌ను ఢీకొట్టడం కష్టమే అవుతుంది. అసలే గెలుపు కోసం ఏకంగా దళిత బంధు వంటి పథకాలు బయటకు తెస్తున్న కేసీఆర్‌ను ఢీకొట్టడం అంత సులభం కాదు.. మరి.. చూడాలి ఏం జరుగుతుందో..?