తెలుగు బిగ్‌బాస్ విజేతలకు ఎందుకీ ఖర్మ.. ఏంటి ఈ బ్యాడ్ సెంటిమెంట్..?
బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. హిందీలో మొదలై తెలుగు సహా అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించిన ఈ షో, ప్రస్తుతం తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుంది. స్టార్ హీరోల హోస్టింగ్, సెలబ్రిటీల సందడి, గొడవలు, ఎమోషన్స్‌తో ఈ షో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే, బిగ్ బాస్ షో గురించి ఒక ఆసక్తికరమైన చర్చ ఎప్పుడూ నడుస్తుంటుంది. ఓ బ్యాడ్ సెంటిమెంట్ బిగ్‌బాస్‌కు కామన్ అయిపోయింది. తెలుగు బిగ్ బాస్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, విజేతలకు ఈ షో తెచ్చిన క్రేజ్ కంటే, వారి కెరీర్‌కు అది కలిగించిన ప్రయోజనం చాలా తక్కువనిపిస్తుంది.
సీజన్ 1 & 2 : మొదటి సీజన్ విజేత శివబాలాజీ, రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా. వీరిద్దరికీ షో ద్వారా భారీ ఫేమ్ వచ్చినా సినిమాల్లో మాత్రం ఆశించిన అవకాశాలు రాలేదు. శివబాలాజీ నటనకు లాంగ్ బ్రేక్ ఇచ్చి బిజినెస్‌లోకి వెళ్లగా, కౌశల్ వివాదాలతో వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ ఇటీవలే 'కన్నప్ప' సినిమాలో చిన్న పాత్రల్లో మెరిశారు.
సీజన్ 3 (రాహుల్ సిప్లిగంజ్): బిగ్ బాస్ వల్ల నిజంగా లాభపడిన ఏకైక వ్యక్తి రాహుల్ అని చెప్పవచ్చు. సింగర్‌గా ఆయన కెరీర్ బిగ్ బాస్ తర్వాతే ఊపందుకుంది. చివరకు 'నాటు నాటు' వంటి ఆస్కార్ విన్నింగ్ సాంగ్ పాడి గ్లోబల్ గుర్తింపు పొందారు.
సీజన్ 4 & 5: అభిజిత్ సీజన్ 4 గెలిచినా, ఆయన సినిమాల్లో బిజీ కాలేకపోయారు. ప్రస్తుతం ట్రావెల్ బ్లాగర్‌గా కొనసాగుతున్నారు. సీజన్ 5 విజేత వీజే సన్నీ హీరోగా ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో రెస్టారెంట్ నడుపుతున్నారు.
సీజన్ 6 & 7: సింగర్ రేవంత్ ఇప్పటికే పాన్ ఇండియా గుర్తింపు ఉన్న వ్యక్తి అయినప్పటికీ, బిగ్ బాస్ తర్వాత ఆయన యాక్టివిటీ తగ్గింది. ఇక సీజన్ 7 లో 'రైతు బిడ్డ'గా వచ్చిన పల్లవి ప్రశాంత్, టైటిల్ గెలిచిన రోజే అరెస్ట్ కావడంతో విన్నింగ్ కంటే వివాదాలే ఎక్కువయ్యాయి.
సీజన్ 8 & 9: కొత్త ట్రెండ్ :
సీజన్ 8 విజేత నిఖిల్ ప్రస్తుతం ఈవెంట్లకు పరిమితం కాగా, తాజాగా ముగిసిన సీజన్ 9 లో ఒక పెద్ద మలుపు చోటుచేసుకుంది. ఈసారి సెలబ్రిటీలను కాదని, ఒక కామనర్ అయిన కళ్యాణ్ (ఆర్మీ సోల్జర్) టైటిల్ విన్నర్‌గా నిలిచారు. గతంలో పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా స్టార్‌గా గెలిస్తే, కళ్యాణ్ పూర్తిస్థాయి కామనర్ విభాగం నుంచి వచ్చి చరిత్ర సృష్టించారు.
బిగ్ బాస్ టైటిల్ గెలవడం అనేది ఒక అద్భుతమైన ఫీట్. కానీ, ఆ ట్రోఫీ తెచ్చిన మైలేజీని కెరీర్ పరంగా వాడుకోవడంలో మాత్రం మెజారిటీ విజేతలు విఫలమవుతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ మినహా మిగిలిన వారంతా ఏదో ఒక దశలో కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మరి ఆర్మీ సోల్జర్ కళ్యాణ్ ఈ క్రేజ్‌ను ఎలా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి.