హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

Vijaya
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భలే రాజకీయం చేస్తున్నారు. ఒకవైపు తండ్రి గొప్పోడని పొగుడుతునే కొడుకుతో గొడవలకు దిగుతున్నారు. అదికూడా కడప జిల్లా పర్యటనలోనే నిమ్మగడ్డ ఇలాంటి రాజకీయాలకు తెరలేపటం భలే ఆశ్చర్యంగా ఉంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా కడపలో కమీషనర్ పర్యటించారు. ఆ సందర్భంగా మీడియాతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పరిపాలనను బ్రహ్మాండంగా పొగిడేశారు. వైఎస్సార్ ఆశీస్సులతోనే తాను రాజ్ భవన్ కు గవర్నర్ కార్యదర్శిగా వెళ్ళినట్లు చెప్పుకున్నారు. తన అభివృద్ధిలో వైఎస్సార్ పాత్ర చాలా కీలకంగా చెప్పారు. ఇపుడు తాను ఈ స్ధితిలో ఉన్నానంటే దానికి వైఎస్సారే కారణమని కూడా ప్రకటించేశారు.




వైఎస్సార్ పాలన అద్భుతమని, బ్రహ్మాండమని పొగుడుతునే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించటమే విచిత్రంగా ఉంది. జగన్ పై ఉన్న కేసుల్లో విచారణకు హాజరయ్యాను, ఇంకా హాజరవుతానని చెప్పటంలో నిమ్మగడ్డ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావటంలేదు. ఈ వ్యాఖ్యల విషయంలోనే జగన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారా ? అంటూ వైసీపీ నేతలు మండిపోతున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే వైఎస్సార్ వల్ల అంత లాభపడిన వ్యక్తులెవరు సహజంగా జగన్ తో గొడవలు పెట్టుకోవటానికి ఇష్టపడరు. జగన్ వ్యక్తిత్వం నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే దూరంగా ఉండిపోతారు. కానీ నిమ్మగడ్డను  మాత్రం ప్రత్యేక కేసుగా పరిగణించాల్సోస్తోంది.




ఎందుకంటే స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో ప్రభుత్వంతో నిమ్మగడ్డ వివాదాలు అందరికీ తెలిసిందే. ప్రభుత్వంతో నిమ్మగడ్డ తీవ్రస్ధాయిలో ఘర్షణ పడుతున్నారంటే జగన్ తో గొడవలు పడుతున్నట్లే లెక్క. మరి ఒకవైపు వైఎస్సార్ ను పొగుడుతునే ఇంకోవైపు జగన్ తో ఘర్షణ పడటాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి. పైగా ఇపుడు జరుగుతున్న వివాదాలను మొదలుపెట్టిందే నిమ్మగడ్డన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి మార్చిలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రభుత్వంతో చెప్పకుండానే ఏకపక్షంగా నిమ్మగడ్డ వాయిదా వేయటంతోనే ప్రభుత్వానికి ఎలక్షన్ కమీషన్ మధ్య వివాదానికి భీజం పడింది. దీనికి నిమ్మగడ్డే బాధ్యత వహించాలి. మొత్తానికి నిమ్మగడ్డ వ్యాఖ్యలు చూసిన తర్వాత భలే నటిస్తున్నాడంటూ వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: