సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోన్న ప‌వ‌న్ స్టెప్పులు.. క్రెడిట్ ఆ ఒక్క‌డిదే...!

RAMAKRISHNA S.S.
ఏ అభిమాని అయినా తన హీరో నుంచి ఎప్పుడూ ది బెస్ట్ అవుట్ పుట్‌నే ఆశిస్తాడు. అది ప్రతిసారి సాధ్యమవకపోయినా, ఒక్కసారైనా ఆ కోరిక నెరవేరితే దొరికే ఆనందానికి వెల కట్టడం అసాధ్యం. ఇప్పుడు అలాంటి ఫీలింగ్‌లోనే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అభిమానులు ఉన్నారని చెప్పాలి. పవన్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ దేఖేలేంగే సాలా ’ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఈ పాట విడుదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ డాన్స్ క్లిప్స్ వైరల్‌గా మారాయి. చాలా రోజుల తర్వాత పవన్ నుంచి ఇలాంటి ఎనర్జిటిక్ డాన్స్ చూడటం ఫ్యాన్స్‌కు పండగలా మారింది. పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్పులు, స్టైల్ అన్నీ కలిసివచ్చి అభిమానులను ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాయి. అందుకే ఈ సాంగ్ కేవలం యూట్యూబ్ వ్యూస్‌కే పరిమితం కాకుండా, రీల్స్‌, షార్ట్స్‌, ఫ్యాన్ ఎడిట్స్ రూపంలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


సాధారణంగా మన హీరోల అభిమానులు తమ హీరోను దాటి ఇతర హీరోల వర్క్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పవన్ నుంచి వచ్చిన ఈ ఊహించని ఫీస్ట్‌కి పవన్ అభిమానులే కాకుండా ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. వాళ్లూ ఈ డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ, పవన్ ఎనర్జీకి ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా పవన్ డాన్స్ మేనియానే కనిపిస్తోంది.
ఈ హంగామాకు పూర్తి క్రెడిట్ దర్శకుడికే వెళ్లాలి. అప్పట్లో గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాతో పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అచ్చం అలానే చూపించి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌.


పవన్ ఫ్యాన్స్ నాడి బాగా తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్, ఈ ఫస్ట్ సాంగ్‌లో ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో శ్రద్ధగా డిజైన్ చేశారు. చాలా కాలంగా మిస్ అవుతున్న పవర్ స్టార్ ఎనర్జీని మళ్లీ తెరపై చూపించి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశారు.
ఇప్పుడీ ఒక్క పాటతోనే ఇంత హంగామా జరుగుతుందంటే, సినిమా రిలీజ్ అయ్యాక రేంజ్ ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు పెరిగిపోయాయి. మొత్తానికి ‘దేఖేలేంగే సాలా’ సాంగ్‌తో పవన్ కళ్యాణ్ మళ్లీ తన డాన్స్ పవర్ ఏంటో నిరూపించారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: