వైసీపీలో ఖాళీలు ... జ‌గ‌న్ ఎప్ప‌ట‌కీ భ‌ర్తీ చేస్తారో...?

RAMAKRISHNA S.S.
వైసీపీలో ప్రస్తుతం బాగా చ‌ర్చ‌కు వ‌స్తోన్న‌ అంశం… కీలక పోస్టులు ఖాళీగా ఉండటమే. పార్టీ నిర్మాణంలో చాలా ప్రధానమైన స్థానాలు ఇప్పటికీ భర్తీ కాలేదు. వాటిని భర్తీ చేయడంపై పార్టీకి ఇప్పటివరకు ఒక స్పష్టమైన అంచనా గానీ, నిర్దేశిత ప్రణాళిక గానీ కనిపించడంలేదు. సాధారణంగా ఒక సంస్థలో పోస్టులు ఖాళీగా ఉంటే మిగతా ఉద్యోగులపై పని భారం పెరుగుతుంది. కానీ రాజకీయాల్లో పోస్టులు ఖాళీగా ఉంటే భారం ఎవరి మీద పడుతుందో చెప్పడం కష్టం. అయితే ఆ ఖాళీల కారణంగా పార్టీ మాత్రం నష్టపోతుందన్నది వాస్తవం. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తిగా గ్రహించలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు పార్లమెంటు స్థానాలతో పాటు నరసరావుపేట, మచిలీపట్నం వంటి కీలక పార్లమెంటు నియోజకవర్గాలు ప్రస్తుతం పూర్తిగా ఖాళీగా ఉన్నట్లే పరిస్థితి. గత ఎన్నికల్లో టికెట్లు పొందిన నేతలు ఇప్పుడు రాజకీయంగా క్రియాశీలకంగా కనిపించడం లేదు. విజయవాడ నుంచి టికెట్ పొందిన కేశినేని నాని రాజకీయాలకు దూరమయ్యారు.


గుంటూరు నుంచి పోటీ చేసిన నేత జనసేనలో చేరారు. మచిలీపట్నంలో వైసీపీ తరఫున ముందుండే నాయకులు మౌనంగా ఉన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ జెండా మోసే నేతలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇక నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తిరిగి తన అసెంబ్లీ నియోజకవర్గం వైపు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయనని, నెల్లూరు సిటీలోనే కొనసాగుతానని ఆయన చెబుతున్నట్టు సమాచారం. అలాగే చీరాల, మాచర్ల నియోజకవర్గాల్లోనూ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మాచర్లలో వచ్చే ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయకపోవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన సతీమణి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.


ఇలా ఒకటి కాదు… రెండు కాదు… చాలా నియోజకవర్గాలు ఖాళీగా ఉండటం వైసీపీకి పెద్ద మైనస్‌గా మారింది. మరీ ముఖ్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్‌ నివసించే ప్రాంతానికి సమీపంలోనే రెండు మూడు నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగళగిరి, రేపల్లె వంటి చోట్ల పార్టీని ముందుండి నడిపించే నేతలే లేరు. ఇంతటి పరిస్థితుల్లో ఈ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? పార్టీని మళ్లీ లైన్‌లో పెట్టేది ఎప్పుడు? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. అయితే ఈ అంశాలపై అధినేత స్థాయిలో ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. అంతేకాదు… ఈ ఖాళీ పోస్టుల కోసం ముందుకు వచ్చే నాయకులు కూడా లేకపోవడం మరో విశేషంగా మారింది. ఇది వైసీపీ భవిష్యత్తుకు మరింత సవాలుగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: