హెరాల్డ్ సెటైర్ : పవన్ ధైర్యం ఏమిటో బయటపడిపోయిందా ?

Vijaya
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నదంటే అధినేత పవన్ కల్యాన్ బాగా ధైర్యం చేస్తున్నాడనే అనుకున్నారందరు. కానీ ప్రకటన చేసిన 48 గంటల్లోనే పవన్ ఎంతటి పిరికివాడు అనే విషయం బయటపడిపోయింది. జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏకపక్షంగా  ధైర్యంగా ప్రకటించేసిన పవన్ ఆ తర్వాత బీజేపీతో పొత్తుకు పాకులాడారు. చివరకు గ్రేటర్ ఎన్నికల బరినుండి హోలు మొత్తంగా జనసేన పోటీ నుండి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. నిజానికి గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేంత సీన్ జనసేనకు లేదని అందరికీ తెలిసిందే. పార్టీ పెట్టినప్పటి నుండి ఇన్ని సంవత్సరాల్లో జనసేన ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది లేదు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా పోటీ చేయాలని డిసైడ్ చేయటం ఏమిటా అని అందరు ఆశ్చర్యపోయారు. కానీ పవన్ ప్రకటన చూసిన తర్వాత పోటీ విషయంలో పెద్ద ధైర్యమే చేస్తున్నాడులే అనుకున్నారు. తీరా చూస్తే పోటీ చేస్తామని ప్రకటించేసి తర్వాత తీరిగ్గా బీజేపీతో పొత్తు కారణంగా అభ్యర్ధులను విత్ డ్రా చేయటంతో పవన్ ధైర్యం ఏమిటి అనేది బయటపడిపోయింది.



జనసేనతో పొత్తు లేదని ఒకవైపు స్వయంగా బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన తర్వాత కూడా లేదు లేదు తమ రెండు పార్టీల మధ్య పొత్తుంటుందని జనసేన ప్రకటనతో నవ్వుల పాలయ్యింది. ఇక్కడ వాస్తవం ఏమిటంటే జీహెచ్ఎంసి పరిధిలోని 150 డివిజన్లలో పోటీ చేసేంత సీన్ పార్టీకి లేదని పవన్ కు తప్ప మిగిలిన అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఏరోజు తెలంగాణాలో కానీ గ్రేటర్ పరిధిలో కానీ జనసేన కార్యక్రమాలు చేసింది లేదు. పైగా కేసీయార్ అంటే భయపడి అసలు తెలంగాణా రాజకీయాలకు ఇన్ని సంవత్సరాలు జనసేన దూరంగా ఉండిపోయింది. తెలంగాణా రాజకీయాల గురించి కానీ టీఆర్ఎస్ విషయంలో కానీ పొరబాటున కూడా పవన్ ఒక్కమాట కూడా మాట్లాడింది లేదు. ఇలాంటి నేపధ్యమున్న పార్టీ హఠాత్తుగా ఎందుకు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ చేసిందో పవనే చెప్పాలి. ఒకవైపు పొత్తుంటుందని జనసేన  చెప్పటం మరోవైపు పొత్తుందడని బండి ప్రకటించటంతో పవన్ పరువు మొత్తం పోయిందనే చెప్పాలి.




తాజా పరిస్ధితి ఏమిటంటే పొత్తులేకుండా జనసేన 150 డివిజన్లలో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులే దొరకలేదు.  ఇదే సమయంలో బీజేపీకి ప్రచారం చేయమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ నుండి విజ్ఞప్తులు అందాయి.  దాంతో పరువు నిలుపుకునేందుకు ఏకంగా జనసేనను పోటీ నుండే విత్ డ్రా చేసేశారు.  బీజేపీతో చేతులు కలపటం ద్వారా గ్రేటర్ లో ఉనికి చాటుకోవాలని పవన్ చేసిన ప్రయత్నం మొదట్లోనే బెడిసికొట్టింది.  పొత్తు విషయంలో పవన్ ప్రతిపాదన చేసే సమయానికే బీజేపీ తన అభ్యర్ధుల జాబితాను దాదాపు ఫైనల్ చేసేసింది. అభ్యర్ధులను ఫైనల్ చేసి నామినేషన్లకు వీలుగా బీ ఫారంలు కూడా ఇచ్చేసిన సమయంలో పొత్తు గురించి మాట్లాడితే బండి జనసేనను ఎలా పట్టించుకుంటారు ?  అంటే ఏపిలో బీజేపీ జనసేనను పట్టించుకోవటం లేదనే మంట ఏమన్నా పవన్ లో ఉందేమో. ఎందుకంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన  అందరికీ తెలిసిందే. కాబట్టి తాము కూడా గ్రేటర్ ఎన్నికల్లో ఇలాగే ప్రకటించి బీజేపీని ఇరుకున పెడదామని పవన్ అనుకున్నాడేమో. కానీ పవన్ ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: