హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు భారం దించుకుంటున్నాడా ?

Vijaya
ఎప్పుడెప్పుడు భారం తగ్గించుకుందామా అని ఎదురు చూస్తున్నట్లుంది చంద్రబాబునాయుడు పరిస్ధితి. అందుకనే అవకాశం రాగానే లేకపోతే అవకాశాన్ని తానే కల్పించుకుని చంద్రబాబు బరువు దింపుకునేసినట్లున్నాడు. తాజాగా పార్లమెంటు నియోజకవర్గాల మహిళా అధ్యక్షుల ప్రమాణస్వీకారం సందర్భంగా లోకేష్ హాజరవ్వటం గురించే ఇదంతా. మహిళా అధ్యక్షుల ప్రమాణస్వీకార కార్యక్రమం అంటే  ఇంపార్టెంటనే చెప్పాలి. అయితే ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబే హాజరవ్వాలి. కానీ కరకట్ట మీదున్న ఇంట్లో నుండి చంద్రబాబు బయటకు రాలేదు. పోనీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అయినా  హాజరయ్యారా అంటే అదీలేదు. మరి ఎవరు హాజరయ్యారంటే ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ ఒక్కడే హాజరయ్యాడు. పార్టీ తరపున ఇతర సీనియర్ నేతలు హాజరుకాలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది.



ఎందుకిలా జరిగిందంటే ఈ కార్యక్రమంలో తాను కానీ కళా కానీ ఇంకే సీనియర్ నేతలైనా హాజరైతే అటెన్షన్ అంతా అటు కూడా ఉంటుంది. అదే రెండో నేత లేకుండా కేవలం లోకేష్ మాత్రమే హాజరైతే అందరి అటెన్షన్ మొత్తం నారావారి వారసుడి మీదే ఉంటుంది.  అలాగే మూడు రోజుల క్రితం రాజధాని గ్రామాలైన ఉద్దండవారి పాలెం, దొండపాడు, నేలపాడు తదితర గ్రామాల్లో పర్యటించాడు. సరే దొండపాడులో జనాలు ఎదురు తిరిగారనుకోండి అది వేరే సంగతి.  తాజాగా వరద ముంపు ప్రాంతాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డిపై అర్ధంలేని ఆరోపణలు, విమర్శలు చేశాడు. రైతాంగాన్ని ఆదుకోవాలట, గిట్టుబాటు ధరలు కల్పించాలట, తడిసిపోయిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలట.  నిజానికి లోకేష్ డిమాండ్ చేసిన వాటిని  ప్రభుత్వం ఎలాగూ చేస్తుంది. కాకపోతే వర్షాలు తగ్గిపోయినాక, ముంపు తెరిపిచ్చినాక మాత్రమే చేయగలుగుతుంది.



ఎందుకంటే వర్షాలు పడుతుంటే ఏ ప్రభుత్వం కూడా పంటలను కొనలేందు. ముందు ముంపు, వర్షాల బాధితులకు సహాయ పనులను చేయటంపైనే దృష్టి పెడుతుంది. వర్షాలు తగ్గిన తర్వాత ఉన్నతాధికారుల అంచనాలు తయారు చేసిన తర్వాత మాత్రమే కొనుగోలుకు రెడీ అవుతుంది.  ఇంతోటి దానికి లోకేష్ నానా హడావుడి చేయటమే విచిత్రంగా ఉంది. అసలు తమ హయాంలో  ఇటువంటి సందర్భాలు వచ్చినపుడు ప్రభుత్వం ఏ మేరకు రైతులకు సాయం చేసిందన్న విషయాన్ని లోకేష్ ముందు వివరిస్తే బాగుంటుంది.  సరే ఏదేమైనా లోకేష్ తండ్రి పక్కన లేకుండా పర్యటనలు చేయటమే ఆశ్చర్యం.  ఎందుకంటే ప్రతి విషయంలోను చంద్రబాబు దగ్గరుండి మరీ పుత్రరత్నానికి స్పూన్ ఫీడింగ్ చేసినా ఎక్కడా ఉపయోగం కనబడటం లేదు.  ఎందుకంటే సొంతంగా ఆలోచించి ప్రభుత్వంపై సరైన ఆరోపణలు, విమర్శలు చేసేంత సీన్ లోకేష్ కు లేదని అందరికీ తెలిసిందే.



అందుకనే ఇంతకాలం పిల్లల కోడి తన పిల్లలను రక్షించుకున్నట్లుగా లోకేష్ ను చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చాడు. కారణం ఏదైనా కానీండి మొత్తానికి లోకేష్ కు సొంతంగా ఆలోచించే తెలివి లేదని అర్ధమైపోయింది. అందుకనే  నేతలతో సమావేశాలను, మీడియా సమావేశాలను కూడా  నిలిపేసి కేవలం ట్విట్టర్ కు మాత్రమే పరిమితమైపోయాడు. మాట్లాడటం మొదలుపెడితే ఏం మాట్లాడుతాడో లోకేష్ కే తెలియదు మరి. కానీ ఎంతకాలం ఇలా ఇంట్లోనే కూర్చుని ట్విట్టర్ కే పరిమితమవుతాడు ? అందుకనే చంద్రబాబు ధైర్యంచేసి ఒంటరిగా పంపుతున్నట్లున్నాడు. సరే జనాల్లో తిరిగితేనే కదా అసలు విషయం బయటపడేది, లోపాలు సవరించుకునేది. చూద్దాం ఇలాగైనా తనలోని లోపాలను లోకేష్ సర్దుబాటు చేసుకుంటాడేమో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: