హెరాల్డ్ సెటైర్ : న్యాయవ్యవస్ధను వివాదంలోకి లాగేసిన ఎల్లోమీడియా .. జగన్ వెయిట్ చేస్తున్నాడా ?

Vijaya
రాష్ట్రంలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. రాజకీయాల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతోంది. జగన్ ధాటికి తట్టుకోలేకపోతున్న చంద్రబాబునాయుడు అరువుగా సిపిఐ, కాంగ్రెస్ తదితరాలను కూడా అద్దెకు తీసుకున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు ఎటువంటి డిమాండ్ చేస్తే పై పార్టీలు కూడా అవే డిమాండ్లను చేస్తున్నాయి.  మొన్నటి వరకు వీళ్ళకు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బిజెపి కూడా పనిచేసినా కన్నా స్ధానంలో సోమువీర్రాజు రావటంతో కమలం నుండి చంద్రబాబుకు మద్దతు ఆటిపోయింది. అయితే ఎన్నిపార్టీలు మద్దతుగా నిలుస్తున్నా టిడిపిని జనాలు పట్టించుకోవటం లేదు. అందుకనే లాభంలేదని స్వయంగా జగన్ పై చంద్రబాబు తరపున  ఎల్లోమీడియానే యుద్ధం ప్రకటించేసింది. యుద్ధం ప్రకటించిన ఎల్లోమీడియా ఏమైనా వాస్తవాలు రాస్తోందా అంటే అలాకాకుండా ప్రభుత్వంపై బురద చల్లటం మొదలుపెట్టింది.



గడచిన ఏడాదిగా ప్రభుత్వంపై ఎన్నో నిరాధార కథనాలు వండి వార్చింది. ఇందులో భాగంగానే తాజాగా న్యాయవ్యవస్ధను కూడా బజారుకీడ్చింది.  తాజాగా అచ్చేసిన కథనం ఏమిటంటే న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేసిందని. హెడ్డింగ్ మాత్రం భీకరంగా పెట్టినా లోపల మ్యాటరంతా ఉత్త డొల్లే అనుకోండి అదివేరే సంగతి. ఎక్కడా న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందనటానికి ఒక్క ఆధారం కూడా చూపలేదు. అసలు ట్యాప్ అయిన న్యాయమూర్తుల వివరాలు కూడా ఇవ్వలేదు. ఆరుగురు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేయటమంటే మామూలు విషయం కాదు. నిజంగానే అలా జరిగుంటే న్యాయమూర్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రింకోర్టుకు, కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదులు చేయకుండా ఉంటారా ? హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ కథనాన్ని సూమోటోగా విచారణకు తీసుకోకుండా ఉంటారా ? అలాంటిదేమీ జరిగినట్లు లేదు.



ఇదే సమయంలో కథనం తప్పంటూ ప్రభుత్వం సదరు యాజమాన్యానికి నోటీసులిచ్చింది. దీనికి యాజమాన్యం ఏమని బదులిస్తుందనేది వేరే సంగతి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ప్రభుత్వం, ఎల్లోమీడియాలో కథనం ఎలాగున్నా తనంతట తానుగా స్పందించాల్సిన అవసరం న్యాయవ్యవస్ధకుంది. ఆరుగురు న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఎల్లోమీడియాలో కథనం వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత హైకోర్టుపై పడింది. ప్రభుత్వపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చాటానికి హైకోర్టే జ్యుడీషియల్ విచారణకు ఆదేశించటమో లేకపోతే సిబిఐతో విచారణ చేయించటమో జరగాలి.  విచారణ చేయిస్తేనే వాస్తవం ఏమిటో బయటకు వస్తుంది. విచారణలో ఎల్లోమీడియాలో కథనం నిజమే అని తేలితే అప్పుడు ప్రభుత్వంపై చర్యలు తీసుకోవటానికి హైకోర్టుకు అవకాశం ఉంటుంది.



ఒకవేళ కథనం అబద్ధమని తేలితే ? ప్రభుత్వంపై బురదచల్లుతున్న ఎల్లోమీడియాపై తనంతట తానుగానే హైకోర్టు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఎల్లోమీడియాపై చర్యలు తీసుకునే  బాధ్యతను  ప్రభుత్వానికి వదిలేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇన్ని రోజులు ప్రభుత్వంపై బుర్రకు ఏది తోస్తే అదల్లా ఎల్లోమీడియా రాసేసేది. కారణాలు కూడా సరిగ్గా తెలీదుకానీ జగన్ కూడా  ఆ రోత రాతలన్నింటినీ భరించి ఊరుకున్నాడు. కానీ ఇపుడు ఏకంగా ప్రభుత్వం+న్యాయవ్యవస్ధను కలిపి కథనం రాయటం ద్వారా హైకోర్టుపైన కూడా బురద చల్లేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ పైన బురద చల్లుతున్నానని అనుకుని హైకోర్టుకు కూడా బురద పూసేసింది.  కాబట్టి ఇపుడు హైకోర్టు స్పందించి వెంటనే విచారణ చేయిస్తేనే తనపై పడిన బురద వదిలిపోతుంది.



మొత్తానికి ప్రభుత్వం, ఎల్లోమీడియా మధ్య వివాదం తారాస్ధాయికి చేరుకున్నట్లే అర్ధమవుతోంది. కథనం కారణంగా జగనా ? లేకపోతే ఎల్లోమీడియానా అనేది తొందరలోనే తేలిపోతుందనే అనిపిస్తోంది. మహాభారతంలో కూడా శిశుపాలుడు చేసిన తప్పులు శ్రీ కృష్ణుడు వందయ్యేంతవరకు ఓపికపట్టిన ఘటన గుర్తుకువస్తోంది. ఎల్లోమీడియా మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలంటే అందుకు జ్యుడీషియరీ నుండి క్లీన్ సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ ఏదో హైకోర్టే ప్రభుత్వానికి ఇస్తేనే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది.  కథనం వచ్చిన తర్వాత కూడా హైకోర్టు తనంతట తానుగా ఎందుకు స్పందించలేదు ? అన్నదే చాలామందికి అర్ధం కావటంలేదు.  కాబట్టి  తొందరలోనే ఆసక్తికరమైన రాజకీయాలను ఏపి ప్రజలు చూడటం మాత్రం ఖాయమనే అనిపిస్తోంది. లెటజ్ వెయిట్ అండ్ వాచ్.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: