కుప్పం: అబ్బే.. చంద్రబాబు చెప్పిందంతా అబద్దం..!

Chakravarthi Kalyan
కుప్పం ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. ఆయన ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించారు కూడా. అయితే.. కుప్పం ప్రాంతంలో ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడం లేదని గనుల శాఖ డైరెక్టర్‌ చెబుతున్నారు. గత నెలలో 4 బృందాలతో కుప్పంలో తనిఖీలు జరిపామని.. అక్రమ మైనింగ్‌కు బాధ్యులైన వారికి డిమాండ్ నోటీసులు ఇచ్చామని గనుల శాఖ డైరెక్టర్ తెలిపారు.

కుప్పం ప్రాంతంలో ఇప్పటివరకు 15 సార్లు దాడులు చేశామని.. ఇప్పటికే రూ.5 కోట్ల విలువైన గ్రానైట్, 6 కంప్రెషర్లు, 2 హిటాచీలు స్వాధీనం చేసుకున్నామని గనుల శాఖ చెబుతోంది. రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖల సమన్వయంతో పూర్తి పర్యవేక్షణ జరుగుతోందని.. కుప్పం ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు అవకాశం లేకుండా నిఘా ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు.
ద్రవిడ వర్సిటీ ప్రాంతంలో మైనింగ్ చేయకుండా ట్రెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నామని.. సెక్యూరిటీ గార్డుల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని గనుల శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో అక్రమ మైనింగ్, రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. మైనింగ్ అక్రమాల నియంత్రణకు మూడంచెల విధానం అమలు చేస్తున్నామని గనుల శాఖ డైరెక్టర్ తెలిపారు. అక్రమ మైనింగ్ రవాణా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు కూడా ఏర్పాటు చేశామని గనుల శాఖ తెలిపింది. అయితే.. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు అక్కడే మూడు రోజుల పాటు గడిపారు. తన పర్యటన చివరి రోజు చంద్రబాబు అక్రమ క్వారీలను సందర్శించారు.

ఈ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా శాంతిపురం, గుడుపల్లె మండలాలలో పెద్ద ఎత్తున క్వారీలు నిర్వహిస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు చంద్రబాబుకు తెలిపారు. దీంతో క్వారీ జరుగుతున్న ప్రాంతాలను చంద్రబాబు సందర్శించారు. అక్కడి పరిస్థితులు పరిశీలించారు. చంద్రబాబు ఆరోపణలు చేసిన వెంటనే రంగంలోకి దిగిన మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే.. దాడులు చేశామని చెబుతున్న అధికారులు.. అక్రమ మైనింగ్ మాత్రం జరగడం లేదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: