వార్నీ: వాళ్లను జగన్ ఇలా కూడా వాడుతున్నాడా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ వర్గాలపై తన మార్కు సృష్టించుకున్నారు. గ్రామ వాలంటీర్ల పేరుతో ఓ సొంత ముద్ర వేశారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి భారీగా నియామకాలు చేశారు. ఇప్పుడు ఇదే గ్రామ వాలంటీర్లు జగన్ సైన్యంగా మారారు. గ్రామ వాలంటీర్లు చాలా చోట్ల వైసీపీకి చెందిన వారినే నియమించుకున్నారన్న విమర్శలు అప్పట్లో చాలా వచ్చాయి.

అయితే.. ఇప్పుడు వీరే జగన్‌కు బలంగా, బలహీనతగా మారారని చెప్పొచ్చు. ఎందుకంటే.. ప్రతి సర్కారు పనిలోనూ వీరు కీలకంగా మారుతున్నారు. కరోనా సమయంలో వీరు అందించిన సేవలకు జనంలో మంచి మార్కులు పడ్డాయి. అయితే.. ఈ వాలంటీర్ల సాయంతో.. ప్రభుత్వం వైసీపీ అనుకూలరకే పథకాలు అందేలా పక్షపాతం చూపిస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఏదేమైనా వాలంటీర్ల పేరుతో జగన్ ప్రభుత్వ పాలనలో ఓ కొత్త మార్పు తీసుకొచ్చారు.

ఇప్పుడు జగన్ ఆ మార్కును మరింత కొత్త దిశలకు తీసుకెళ్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులతో పేచీ ఉన్న సంగతి తెలిసిందే. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఏమాత్రం తగ్గకుండా సమ్మెకు సైతం సిద్ధం అవుతున్నారు. ఆ సన్నాహాల్లో భాగంగా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఈ చలో విజయవాడను అడ్డుకునేందుకు ప్రభుత్వం వాలంటీర్లను వాడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

చలో విజయవాడకు వెళ్లే ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని వాలంటీర్లకు అధికారుల నుంచి అనధికారికంగా ఆదేశాలు అందాయట. వాలంటీర్లకు వాట్సప్ గ్రూపుల ద్వారా ఈ రకమైన ఆదేశాలు అధికారులు ఇస్తున్నట్టు సమాచారం వస్తోంది. అంటే వాలంటీర్లను జగన్ ప్రభుత్వం నిఘా పనులకు కూడా వాడుతోందన్నమాట. ఇప్పటి వరకూ ప్రభుత్వ పథకాల పంపిణీలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లు ఇకపై నిఘా పనులు కూడా చేస్తారన్న విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పటిష్టమైన వ్యవస్థగా మారిన వాలంటీర్లను జగన్ ఇలా కూడా వాడుతున్నాడా అని జనం ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: