రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ అంటే తెలియని వారు ఉండరు.. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంత్రి పదవి చేపట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ క్రియాశీలక పాత్ర పోషించారు. తన జీవితంలో ఒక సీఎం పదవి తప్ప అన్ని పదవులు చేపట్టిన గొప్ప నాయకుడు అని చెప్పవచ్చు. అలాంటి బొత్స సత్యనారాయణ ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లోనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని అనుకున్నారట.కానీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్ల మళ్ళీ పోటీ చేశారు. కానీ అక్కడ ఓటమిపాలయ్యారు. ఆయనను అంతగా నమ్మినటువంటి చీపురుపల్లి నియోజకవర్గంలో ఆయన ఓడిపోయినా కానీ ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ, తాను అందుబాటులో లేని సమయంలో కొడుకు లేదా కూతురును పంపిస్తున్నారు.
అంతే కాదు కొడుకు కూతురు భవిష్యత్తు రాజకీయాల కోసం ఇప్పుడే ప్లాన్లు గీస్తున్నారని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి కొడుకు కూతురు రాజకీయంగా బలపడాలని విజయనగరం జిల్లాలో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా వారిని ముందు పెడుతూ తాను వెనుక కనిపిస్తున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి అరడజనుకు పైగా నాయకులు వివిధ రాజకీయ హోదాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు సందీప్ ను చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని బొత్స డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లోనే ఆయన పోటీకి ఉత్సాహం చూపినా కానీ అధిష్టానం సందీప్ ను యాక్సెప్ట్ చేయకపోవడంతో మళ్లీ బొత్స సత్యనారాయణ పోటీ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో తన కొడుకు సందీప్ తో పాటు కూతురుని కూడా అనేక కార్యక్రమాల్లో తిప్పుతున్నారు. అయితే ఇద్దరినీ ఒకే నియోజకవర్గంలో ఉంచితే ఇద్దరికి రాజకీయ విభేదాలు వస్తాయని ముందుగానే ఆలోచన చేసిన బొత్స సత్యనారాయణ తన కూతురును చీపురుపల్లి నియోజకవర్గంలోని ఒక మండలం నుంచి జెడ్పిటిసిగా పోటీ చేయించాలని భావించినట్టు తెలుస్తోంది.
ఆమెను జెడ్పిటిసి గా చేసి విజయనగరం జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించేలా ఆయన ప్లాన్స్ వేస్తున్నారని సమాచారం. ఇప్పటికే విజయనగరం జడ్పీ చైర్మన్ గా బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. అయితే ఈయనను భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా వైసీపీ పార్టీ నియమించింది. దీంతో ఆ స్థానంలో తన కూతురు అనూషను జడ్పిటిసిగా పోటీ చేయించి జెడ్పి చైర్మన్ ని చేసి కొడుకును చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్టు సమాచారం. అయితే వారసులకు రాజకీయాన్ని అప్పజెప్పి తాను రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి బొత్స సత్యనారాయణ వేసిన ప్లాన్లు వర్కౌట్ అవుతాయా..లేదంటే బెడిసి కొడతాయా.. అనేది ముందు ముందు తెలుస్తుంది.