జ‌గ‌నన్న అప్పు : విశాఖ తాకట్టు !

RATNA KISHORE
విశాఖకే అభివృద్ధి అని అన్నారు. మ‌రో రాజ‌ధాని అదే అని కూడా చెప్పారు. విజ‌య‌వాడ త‌రువాత మా ప్రాణం మా ధైర్యం విశాఖ అనే ప‌లికారు. ఇప్పుడు ఆస్తులపై క‌న్నేసి విలువ‌యిన ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌పై క‌న్నేసి ఆఖ‌రికి త‌హ‌శీల్దార్ కార్యాల‌యం మొదలుకొనిన ఇతర విలువయిన స్థ‌లాలు కూడా తాకట్టు పెట్టేసింది ఏపీ స‌ర్కారు. ఇంకేం ఆర్థిక రాజ‌ధాని అంటే అలానే ఉండాల. అడ్మినిస్ట్రేష‌న్ కు ఆ మాత్రం డ‌బ్బులు విశాఖ న‌గ‌ర‌మే స‌మ‌కూర్చి ఇవ్వాల‌! లేకుంటే అది రాజ‌ధాని కాకుండా పోతుంది. అప్పులు కుప్ప‌లుగా రాష్ట్రంలో ప్ర‌తి చోటా ఉన్నా ఏమీ అన‌లేని అడ‌గ‌లేని ప్ర‌జ‌లు కొంద‌రు పాపం మౌనంగా ఉంటున్నార‌ని విప‌క్షం కూడా అంటోంది. ఇదంతా స్టేట్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ మాయ‌.


ఈ మాయ‌లో భాగంగా ఆస్తుల అమ్మ‌కం, అప్పులు తేవ‌డం, అవి తీసుకువచ్చి జ‌నాల ఖాతాల్లో ధనాధ‌న్ వేసేయ్యడం మిన‌హా వైసీపీ స‌ర్కారు చేస్తున్న‌దేం లేద‌ని తేలిపోయింది. కేంద్ర ఆర్థిక శాఖ కూడా అప్పుల‌పై హెచ్చ‌రిక‌లు ఇస్తుంటే ప‌క్క‌దోవ‌లు వెతికి, రాజ మార్గంలో త‌న‌ఖాలకు సైతం సిద్ధ‌మ‌యి పోయి హాయిగా ప్ర‌జ‌ల‌పై పెను భారం మోపేందుకు స‌ర్కారు సిద్ధం అవుతున్న వైనం రేప‌టి వేళ అత్యంత ప్ర‌మాద‌క‌రం.

జ‌గ‌న‌న్న ఏం చేసినా రాష్ట్రం మంచి కోస‌మే అని ఎప్పుడో తేలిపోయింది. తేల్చేశారు కూడా! ఎంతైనా మ‌న‌కు ల‌క్ష కోట్ల సంక్షేమం కావాలి క‌నుక ఓ పాతిక కోట్లు అప్పు కూడా కుద‌రాలి. ఆ ప‌ని జ‌గ‌న‌న్న చేశారు. విశాఖ న‌గ‌రంలోనే విలువైన ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టేశారు. దీంతో స్టేట్ డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ ద్వారా ఎస్బీఐ క్యాప్ కు లోన్ అప్లై చేసుకుని, తొలి విడత‌లో 21500, మలి విడ‌త‌లో మూడు  వేల కోట్లు లాగేశారు. స్టాంప్ డ్యూటీ కింద ప్ర‌భుత్వ ఆస్తుల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో చెల్లించాల్సిన మొత్తాల‌ను మిన‌హాయించాల‌ని జీఓ కూడా పాస్ చేసేశారు. దీంతో జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ కార్యాల‌యానికి 250 కోట్ల  రూపాయ‌లు ఎగ్గొట్టింది కూడా! ఆ విధంగా కూడా ఆ సంస్థ ఆదాయాన్ని ఆపేసింది. దీంతో విశాఖ న‌గ‌రంలో అత్యంత విలువ‌యిన ప్ర‌భుత్వ స్థ‌లాలు, భ‌వ‌నాలు బ్యాంకు త‌న‌ఖాకు వెళ్లిపోయాయి. సెప్టెంబ‌ర్ 27 నే దీనికి సంబంధించి రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్ కూడా పూర్త‌యిపోయింది. మ‌రో 17 వేల కోట్ల అప్పు కోసం ఎస్బీఐ క్యాప్ ను అడిగారు కూడా! అందుకు సంబంధించి ఎక్క‌డెక్క‌డి ఆస్తులు తెస్తారో ఏంటో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: