మేమింతే.. కూర్చున్న కొమ్మను మేమే నరుక్కుంటామ్‌..!

Chakravarthi Kalyan
మేం మనుషులం.. మామూలు మనుషులం కాదు.. తెలివైన మనుషులం.. కేవలం తెలివైన మనుషులం కాదు.. అతి తెలివైన మనుషులం.. ఈ భూమి మీద మా అంత తెలివైన జంతువే లేదు. మాకు ఏనుగంత బలం లేకపోవచ్చు.. పులి అంత క్రూరత్వం లేకపోవచ్చు.. కానే ఈ భూమికి మేమే సుప్రీం.. మేం చిరుతలా పరుగెత్తలేకపోవచ్చు.. మేం సింహంలా వేటాడలేకపోవచ్చు..కానీ ఈ భూమికి మేమే రారాజులం.. ఈ భూమి మీద జంతువుల్నే కాదు.. ఈ ప్రపంచాన్నే మా పాదాక్రాంతం చేసుకున్నాం.

మా తాతలు ఒకప్పుడు అడవి జంతువుల్లాగానే పెరిగారు. ఆ తర్వాత కాస్త మారాం. నిప్పు కనిపెట్టాం.  వంట కనిపెట్టాం.. అప్పుడే సుఖాలకూ మరిగాం.. ఆ తర్వాత చక్రం కనిపెట్టాం..అంతే మా అభివృద్ధి పరుగు పెట్టింది. అలా ఎన్నో వస్తువులు కనిపెట్టాం.. సుఖం సుఖం సుఖం.. ఇదీ మాకు కావాలి.. ఇంకా సుఖం.. ఇంకా సుఖం.. జీవితం సుఖ మయం చేసుకున్నాం..అంతటితో ఆగామా.. ఈ సుఖం చాలదు.. అవును మాది అత్యాశే.. ఆ సంగతి మాకూ తెలుసు.. ప్రపంచాన్ని జయించిన మేం ఇప్పుడు.. సుఖానికి బానిలం అయ్యాం.. ఇంకా..ఇంకా.. ఇంకా.. మా తపనకు అంతులేదు.

అదిగో ఆ అత్యాశే.. మా కొంప ముంచుతోంది.. మేం కనిపెట్టిన యంత్రాలు మా ముందు తరాలను మాయం చేస్తున్నాయి.. మేం కనిపెట్టిన యంత్రాలు మా భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి. ఈ భూమిపై జీవాన్నే ప్రశ్నార్థకం చేయబోతున్నాయి. ఆ విషయం ఇప్పుడే మాకు తెలుస్తోంది. అయినా ఏమీ చేయలేం.. ఎందుకంటే మేం అంతగా సుఖపడిపోయాం.. ఎవరు చెప్పినా ఎవరం వినే స్థితిలో లేం.. విచిత్రం ఏంటంటే.. మేమేదో ఈ ప్రకృతిని శాసిస్తున్నామని కలలు కన్నాం.. కానీ ఈ ప్రకృతి మాకు అప్పుడప్పుడూ మేమెంత బలహీనులమో చెబుతూనే ఉంటుంది.. ఇప్పటికైనా తప్పుతెలుసుకోమని హెచ్చరిస్తూనే ఉంటుంది.

కానీ మేం వింటామా.. అబ్బే వినం.. అస్సలు వినం.. ఎందుకంటే.. మేం మనుషులం.. మేం కూర్చున్న కొమ్మను నరుక్కునే తెలివైన మనుషులం.. మేం మా నెత్తిన మేమే చేతులు పెట్టుకునే భస్మారుసురుని వారసులం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: