మంచిమాట: ఉపాయం ఉంటే అపాయం ఉండదు..!!
మేక ఎప్పుడెప్పుడు తన దగ్గరకు వస్తుందా..తిందామా అన్నట్టుగా ఆ తోడేలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. అయితే మేక చూడలేదు కదా అని తోడేలు అమాంతం మేక పైకి దూకే సమయానికి, ఒక్కసారిగా ఉలిక్కి పడిన మేక అప్రమత్తమై అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ భయంతో ఎక్కడికి వెళ్లినా తోడేలు విడిచిపెట్టదు అన్న విషయాన్ని గ్రహించిన మేక.. తోడేలు తో.. నీకు పుణ్యం ఉంటుంది.. నన్ను చంపకు. నా ఆకలి ఇంకా తీరలేదు.. నేను ఎంత ఎక్కువ తీయని గడ్డిని తింటే.. నీకు అంత రుచిగా మారుతాను కదా.. అంతేకాదు నీకు కూడా తీయని మాంసం లభిస్తుంది కదా అంటూ పలికింది మేక.
మేక అన్న మాటలకు వెంటనే ఆలోచనలో పడింది తోడేలు. సరే నువ్వు కడుపునిండా గడ్డి మేసే వరకు ఆగుతాను అని చెప్పింది. కాసేపు ఆగిన తర్వాత మేక మళ్లీ తోడేలు దగ్గరకు వచ్చి..నేను కాసేపు అటు ఇటు గెంతుతాను.. నా కడుపులో ఉన్న ఆహారం తొందరగా జీర్ణం అయితే నీకు తినడానికి కష్టం ఉండదు కదా అని చెప్పింది. అందుకు కూడా తోడేలు సరే అని చెప్పింది. సంతోషంగా గెంతుతూ ఉన్న మేకకు మరో సరికొత్త ఆలోచన తట్టింది. తోడేలు తో నా మెడలో ఉన్న గంట ని తీసి వాయించు అప్పుడు నేను వేగంగా గెంతుతాను అని చెప్పింది..
తోడేలు సరే అని గట్టిగా గంట వాయించడం మొదలుపెట్టింది. అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరి అది విని వెంటనే వచ్చి మేకను కాపాడాడు. అతనితోపాటు వచ్చిన కుక్కలు తోడేలు ను తినడానికి ప్రయత్నించడంతో అది కాస్త బ్రతుకుజీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది.