మంచిమాట : గర్వంతో జీవించి ప్రాణహాని తెచ్చుకోకు..!
ఒకరోజు చీమల గుంపు చింతచెట్టు దగ్గరకు వెళ్లి " పెద్ద చింతచెట్టు గారండి మేము మీలో తల దాచుకుంటాం"అని అడిగాయి. " మీరు నా కంట్లో నలుసంత ఉన్నారు. మీరు నా దగ్గర ఉంటారా.? చీ పొండి"అని తరిమికొట్టింది పెద్ద చింతచెట్టు.
మరల చీమల గుంపు చిన్న చింత చెట్టు దగ్గరకు వెళ్లి "చిన్న చింతచెట్టు గారండీ.... మేము మీలో తల దాచుకుంటాం"అని వేడుకున్నాయి."అంతగా అడగాలా! రండి"అంది చిన్న చింతచెట్టు. చీమల గుంపు చిన్న చింత చెట్టు మీద కాపురం పెట్టాయి.
ఒకరోజు కట్టెలు కొట్టే భీమన్న పెద్ద చింత చెట్టును, చిన్న చింత చెట్టును చూశాడు. ముందుగా చిన్న చింత చెట్టు దగ్గరకు వెళ్లి నరకబోయాడు. వెంటనే చీమల గుంపు అతని చుట్టూ చేరి అతనిని కుట్టాయి. అతను చీమల బాధకి భయపడి చిన్న చింత చెట్టు ను వదిలి పెట్టాడు.
పెద్ద చింత చెట్టును నరికాడు. పెద్ద చింత చెట్టు "గర్వం వల్ల ఆపద కలిగింది"అని బాధపడుతూ నేలకూలింది. ఆ కట్టెల భీమన్న ఆ కొమ్మలు, మానును తీసుకెళ్లి సంతలో అమ్ముకున్నాడు. అలా ఎంతో సంతోషంగా జీవించసాగాడు.
ఒకవేళ చింత చెట్టు కనుక ఆ చిన్న చీమలకు నీడను ఇచ్చి ఉన్నట్లయితే , ఈ రోజు ఆ వ్యక్తి చేతిలో కూలి పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.. మనుషులు అయినా సరే ..ఎంత గొప్ప వారైనా ప్రతి ఒక్కరికీ సహాయం చేసే గుణం కలిగి ఉండాలి.. అప్పుడే దేవుడు వారికి అన్ని విధాల సహాయ పడుతాడు.