మంచిమాట : ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన ఆప్తుడు..
ఒకానొక సందర్భంలో ఒకరోజు ఇద్దరు స్నేహితులు కలిసి వేసవి కాలం సెలవులకు.. పట్టణంలో ఉండే వారి బంధువుల ఇంటికి పోవుచున్నారు. అది అడవి మార్గం దారిలో, వారికి ఒక ఎలుగుబంటి కనబడింది. దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ, ఒక చెట్టు వద్దకు చేరారు. ఆ ఇద్దరిలో ఒకరు చెట్టుపైకి ఎక్కాడు.. ఇంకొకడు చెట్టు ఎక్కడానికి రావటం లేదు. పోనీ మిత్రుడైన సహాయం చేస్తాడు అంటే చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. రెండో వాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి, చచ్చిన వాడిలా ఆ చెట్టు కింద పడుకున్నాడు.
ఇక ఇంతలోనే అనుకోకుండా ఎలుగుబంటి వారి దగ్గరకు రానే వచ్చింది. ఇక అక్కడ శవంలా కింద పడుకొని వున్న వాడి వాసనను చూసి , చచ్చిన శవమని గుర్తించి, ఎలుగుబంటి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి దూరంగా వెళ్ళిపోయిన తరువాత , చెట్టు ఎక్కిన వాడు దిగి , పడుకున్న అతని దగ్గరకు వచ్చి, మిత్రమా..! నీ దగ్గరకు వచ్చిన ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది..అని అడిగాడు. అందుకు సమాధానంగా రెండోవాడు కూడా ఆపదలో ఉన్నప్పుడు మిత్రునికి సహాయపడని వాడితో స్నేహం చేయరాదని ఎలుగుబంటి చెప్పింది. అని అన్నాడు.. ఆ మిత్రుడు తన తప్పు తెలుసుకొని, సిగ్గుతో తలదించుకున్నాడు.
చూశారు కదా..! నిజమైన స్నేహితుడు అంటే ఆపదలో తోడుండాలే తప్ప ఆపద వచ్చింది కదా అని తప్పించుకోకూడదు. ఇక మంచి స్నేహితుడు, ఒక మంచి పుస్తకం లాంటి వాడు.కాబట్టి మీరు కూడా మీ మిత్రులను దూరం చేసుకోవద్దు.