అసెంబ్లీలో బాబుపై జగన్ దే పై చేయి..!?

Chakravarthi Kalyan
ప్రత్యేక హోదాపై సభలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. తరచుగా టీడీపీ నేతలు అడ్డు చెబుతున్నా.. స్పీకర్ వారిని అనుమతిస్తూ ఇబ్బంది పెడుతున్నా జగన్ మాత్రం తన ప్రసంగాన్ని అదే దూకుడుగా కొనసాగించారు. ప్రత్యేక హోదా అంటే ఏంటి.. అది వస్తే ఏపీకి ఒకగూడే ప్రయోజనాలేంటి.. అనే విషయాలను సభలో చక్కగా వివరించారు. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వకుండా తన ప్రసంగాన్ని సమర్థించుకునేలా డాటా సమర్పించారు. 

పార్లమెంట్ రీసెర్ట్ సెంటర్ నుంచి సంపాదించిన సమాచారంతో జగన్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. జగన్ ప్రసంగం చూస్తే.. ఈసారి ఆయన బాగానే ప్రిపేర్ అయి వచ్చినట్టు కనిపించింది. పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ డేటాతో పాటు.. గుజరాత్ లా కళాశాల ఒపీనియన్ కూడా తీసుకున్నారు. ప్రత్యేక హోదా కంటే ప్ర్తత్యేక ప్యాకేజీయే బెటర్ అని ఇటీవల తరచూ టీడీపీ నేతలు కొందరు కామెంట్ చేస్తున్నారు. వారి వాదనలను జగన్ తిప్పికొట్టారు. 

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఎలా నిధులు తెచ్చుకుంటున్నాయో జగన్ సోదాహరణంగా వివరించారు. ఇటీవల బీహార్ కు ప్రధాని మోడీ లక్ష కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే.. లక్ష కోట్ల ప్యాకేజీ వచ్చినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదాయే తమకు ముఖ్యమని ప్రకటించడాన్ని జగన్ కోట్ చేశారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు వైఫల్యాన్ని జగన్ సమర్థంగా ఎండగట్టారు. ప్రత్యేక హోదా రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న వారి పేర్లను కూడా చదవకుండా సంతాప తీర్మానం ప్రవేశపెట్టడాన్ని కూడా జగన్ ఖండించారు. 

జగన్ చెబుతున్న వాదనకు అర్థం లేదని..పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ డాటా సెంట్రల్ గవర్నమెంట్ జీవో కాదని.. జగన్ వాదనను చంద్రబాబు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ కూడా జగన్ చంద్రబాబును నిలువరించారు. ఏదైనా తాను సాధించగలదాన్ని అద్భుతం..అపూర్వం అని.. తాను సాధించలేదని దాన్ని అబ్బే.. అది వేస్టని చంద్రబాబు ప్రొజెక్షన్ చేస్తారంటూ జగన్ చురకలు అంటించారు. ఓవరాల్ గా చూస్తే రెండో రోజు జగన్ సభలో మంచి మార్కులే కొట్టేశారనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: