నేడు అక్షయ తృతీయ.. బంగారు వెలుగులు..!!

Edari Rama Krishna
వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.


"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,

దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"


"అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. 
 
  హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. సూర్య చంద్రులిరువురూ అత్యంత ప్రకాశమానంగా ఉండే రోజజు ఇది. ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా అమితమైన శుభ ఫలాలను ఇస్తుందని , ఈ రోజు మొత్తం శుభకరం కనుక వేరే ముహూర్తం కోసం వెతక వలసిన పనిలేదని హిందువులు నమ్ముతారు. కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఈ రోజు పిల్లర్ పని మొదలుపెట్టుకోవడం , నూతన వ్యాపారానికి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం , వెండి బంగారాలను కొనుగోలు చేయడం చేస్తారు.
ఈ రోజున ఆర్జించిన జ్ఞానం, చేసిన దానాల ఫలం ద్విగుణీ కృతమవుతుందనీ , అత్యంత ఫలప్రదమవుతుందనీ నమ్మకం. ఉపవాస దీక్షల ద్వారా, పూజా కార్యక్రమాల ద్వారా భక్తులు ఈ రోజున దైవ ధ్యానం లో గడుపుతారు. నిత్యావసర వస్తువులనూ, వస్త్రాలనూ దానమిచ్చి తులసి తీర్థాన్ని విష్ణు మూర్తి విగ్రహం పై చిలకరిస్తూ స్వామిని పూజిస్తారు. అక్షయ తృతీయ నాడు చేసే గంగాస్నానం శుభ ఫలాలనిస్తుందని నమ్ముతారు.
వేద వ్యాసుడు చెపుతుండగా, విఘ్ననాయకుడైన వినాయకుడు అక్షయ తృతీయ నాడే మహాభారత కథను లిఖించే మహత్కార్యాన్ని ప్రారంభించాడని చెపుతారు. మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని పుట్టినరోజు కూడా ఈ రోజే . గోవా మరియు ఇతర కొంకణ ప్రాంతాలను పరశురామ క్షేత్రాలుగా ఈనాటికీ గుర్తిస్తారు. అక్షయ తృతీయని పరమ పవిత్ర దినంగా అక్కడివారి నమ్ముతారు. త్రేతాయుగం అక్షయ తృతీయ నాడు మొదలైందనీ , ఆనాడే పవిత్ర గంగానది దివి నుండి భూమికి దిగి వచ్చిందనీ మరో కథనం.


"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే

నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"


అతివలు ఆభరణాలను, పురుషులు విలువైన వాహనాలను కోరుకోవడం సహజం. అలాగే షేర్స్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్యా తక్కువేమీ కాదు. అప్పు చేసైనా సరే వస్తువుని సొంతం చేసుకోవాలనే ఆలోచన పురుగులా దొలిచేయడం, దానికి ఆచారమూ, సంప్రదాయమనే ముసుగులు తగిలించి, ఆడంబరాలను ఆహ్వానించడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది. ఉన్నదానితోనే కోరుకున్న దానిని పొందాలనే నియమాన్నవలంబిస్తే, వ్యాపార ప్రకటనల వలలో పడకుండా పురాతన సంప్రదాయాలలో కుటుంబానికి అందుబాటులో ఉన్న వాటినీ , శ్రేయస్కరమైన వాటినీ పాటిస్తే, చిత్త శాంతీ , సమాజ శ్రేయస్సూ రెండూ లభిస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: