మోడీ కేబినెట్లో నిఘా కలకలం..

Kalyan
కేంద్రంలో మోడీ సర్కారు ఎన్నడూ లేనంత బలంగా ఉంది. కనీసం ప్రతిపక్షంగా కూడా గుర్తింపు దక్కని దిక్కుతోటని స్థితిలో ప్రత్యర్థి కాంగ్రెస్ ను నెట్టింది. ఇక మోడీ ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుందన్న నేపథ్యంలో కమల దళానికి సొంత పార్టీలోనే కుంపట్లు మొదలయ్యాయి. ప్రతిపక్షం పాత్రకూడా సొంత పార్టీ నేతలే నిర్వహిస్తారా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మోడి క్యాబినెట్లో విబేధాలు తీవ్రమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ నివాసం నుంచి నిఘా పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారంటూ వచ్చిన వార్తలు ఈ కలకలానికి కారణమయ్యాయి. ఢిల్లీలోని ఆయన ఇంట్లోని ఓ గదిలో సంభాషణలు వినేందుకు ఉపయోగించే పరికరాల్ని గుర్తించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐతే అధికారులు వెంటనే వాటిని తొలిగించినట్లు కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. అలాంటిలాంటి నిఘా పరికరాలు కాదట. అత్యాధునికమైన ఆ పరికరాల్నిసాధారణంగా పశ్చిమ దేశాలకు చెందిన నిఘా సంస్థలు వాడుతుంటాయట. నిప్పులేకుండా పొగ రాదు కదా అని ఇప్పుడు సొంత పార్టీలోనే దీనిపై ఆసక్తికరమైన చర్చనడుస్తోందట. గడ్కరీపై నిఘా వార్తలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ దాడి మొదలు పెట్టింది. సహజంగా ఇలాంటి ఆరోపణలకు దూరంగా ఉండే.. సోనియా రోబో.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కూడా బీజేపీ పై విమర్సల వర్షం కురిపించారు. మంత్రుల నివాసాల్లో నిఘా పరికరాలు అమర్చడం దేశానికి మంచిది కాదన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పార్లమెంటు వేదికపై సుస్పష్ట ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మోడీ మంత్రివర్గంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడానికి, సమన్వయ లోపానికి ఇదొక నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది. ఈ అంశంపై స్పందించిన నితిన్‌ గడ్కరీ.. రొటీన్ గానే ఓ ఖండన ప్రకటన పారేశారు. అది కూడా డైరెక్టుగా కాదు.. అంతా ఊహాగానాలే అంటూ ఓ ట్వీటు ట్వీటారు. కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టు మొత్తానికి ఏదో మతలబు ఉండే ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: