టీడీపీ సమాధానం చెబుతుందా? అవసరంలేదా?!

Padmaja Reddy
ఒకవైపు సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మించే పనిలో ఉన్నామని అంటూనే మరోవైపు హైదరాబాద్ ను రిపేర్ చేయించే పనిని కూడా పెట్టుకొంది తెలుగుదేశం ప్రభుత్వం. హైదరాబాద్ ఇప్పటికే తమది కాదు అనే భావనకు వచ్చారు సీమాంధ్రులు. పదేళ్ల తర్వాత ఎలాగూ సీమాంధ్ర ప్రభుత్వం ఆ మహానగరానికి శాశ్వతంగా సెలవివ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించే ప్రోగ్రామ్ ఎలానూ ఉండనే ఉంది! కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎంగా హైదరాబాద్ నుంచే పాలనను కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై తెలుగుదేశం మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కూడా విమర్శలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి పాలన సాగించడం వల్ల సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో సచివాలయంలో బాబు చాంబరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్లను రిపేర్ చేయించడానికి పది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారనే మాట సీమాంధ్ర ప్రజల్లో మరింత ఆందోళన పెంచుతోంది. ఎలాగూ శాశ్వతం కాని చోట రిపేర్ల పేరుతో సీమాంధ్ర ప్రభుత్వం ఈ విధంగా డబ్బు వెచ్చించడం అంత అభినందించదగిన అంశం కాదు. ఇదే సమయంలో ప్రభుత్వం పొదుపు మాటలకేమీ తక్కువ లేదు! విరాళాలు సేకరణ, పొదుపు చర్యలు అని చెబుతున్నది కూడా తెలుగుదేశం వాళ్లే. మరి పొదుపు అంటే తాము చేపేది కాదు, అన్నట్టుగా ఉంది వ్యవహారం! ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సీమాంధ్ర పాలనను హైదరాబాద్ నుంచి చేయడాన్ని బీజేపీ తప్పుపడుతోంది, బాబు తన చాంబర్ కోసం పది కోట్ల రూపాయలు రిపేరీ వ్యయం చేయడాన్ని వైకాపా తప్పుపడుతోంది. మరి వాళ్లకు తెలుగుదేశం సమాధానం చెబుతుందా? లేక ఆ రెండు పార్టీలనూ లైట్ తీసుకొంటుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: