ఇసుక లభ్యత సులభతరం దిశగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం

NAGARJUNA NAKKA
ఏపీలో ఇసుక లభ్యత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఎక్కడా ఇసుక దొరకడం లేదని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆందోళనలు చేస్తోంది. టీడీపీ రాజకీయ ప్రయోజనాలతోనే దీక్షలు చేస్తోందని మంత్రులు మండిపడుతున్నారు. దీక్షకు దిగిన నేతల్ని అరెస్ట్ చేయడం దారుణమని ట్వీట్ చేసిన మాజీ సీఎం చంద్రబాబు.. జగన్ విఫల ముఖ్యమంత్రి అని ఆరోపించారు. 


ఏపీలో ఇసుక కొరత నివారించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇసుక లభ్యతను మరింత సులభతరం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్, పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకాల ధరలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ పట్టాదారులకు క్యూబిక్ మీటరు ఇసుకకు చెల్లించే ధర పెంచారు. గతంలో క్యూబిక్ మీటర్‌కు  60 రూపాయలుగా ఉన్న ధర వంద రూపాయలకు పెంచారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహించే రీచ్‌లు, స్టాక్‌యార్డులతో పాటు.. ప్రైవేట్ పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 


మరోవైపు రాష్ట్రంలో ఇసుక ఎక్కడా దొరకడం లేదని టీడీపీ ఆందోళన చేస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక కొరతకు నిరసనగా 36 గంటల దీక్ష తలపెట్టిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు.  ఎలాంటి ప్రదర్శనలకు, దీక్షలకు, ర్యాలీలకు అనుమతి లేదని ప్రకటించారు పోలీసులు.  అటు టీడీపీ దీక్షలపై మండిపడ్డారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇసుక కొరతపై చేసే దీక్షలు సొంత దీక్షలని.. టీడీపీ నాయకుల ప్రయోజనానికే చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల నిర్ణయాలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏదో ఒక లోటుపాటును వెతికే ప్రయత్నం చేస్తూ బురద జల్లుతున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ నేతల విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడపుడూ.. ట్వీట్ ల వార్ కూడా కొనసాగుతోంది. తాజాగా ఇసుక లభ్యతపై చేసిన విమర్శలు.. ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకునేదాకా వెళ్లింది.  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: