కారిడార్ ను తరలించవద్దు..మాకు అన్యాయం చేయొద్దు అంటున్న ప్రకాశం జిల్లా ప్రజలు..!

Gowtham Rohith
పారిశ్రామిక కారిడార్ ప్రకాశం జిల్లా దొనకొండ నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు మారనుందా.? ఇటీవలె కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వినుకొండ వరకున్న భూముల గురించి ముఖ్యమంత్రి ఆరా తీయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కారిడార్ తరలి వెళుతోందనే ఆందోళన ప్రకాశం జిల్లా ప్రజల్లో పెరుగుతోంది. పారిశ్రామిక కారిడార్ ను తరలించి ప్రకాశం జిల్లాకు అన్యాయం చేయొద్దని అక్కడి ప్రజలు, ప్రజా సంఘాలు నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ప్రకాశం జిల్లా దొనకొండలో పారిశ్రామిక కారిడార్ రూపుదిద్దు కుంటుందంటూ స్థానికుల్లో ఆశలు రేకెత్తాయి. నాటి టిడిపి ప్రభుత్వం చేసిన ప్రచారం ప్రయత్నాలు కూడా దీనికి ఊతమిచ్చాయి. 



ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు స్థాపించడానికి స్థానిక పెట్టుబడిదారులు విదేశీ సంస్థలు కూడా ఎంతో ఆసక్తి చూపించాయి. అదే సమయంలో దొనకొండలో పరిశ్రమలు స్థాపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తుందని హామీ ఇచ్చారు. చైనా, జపాన్, స్పెయిన్ తో సహా అనేక దేశాల కంపెనీలు ఇక్కడ స్థలాల్ని, ఉన్న వనరుల్నీ పరిశీలించి వెళ్లాయి. స్పెయిన్ కు చెందిన ఓ ఆటో మొబైల్ కంపెనీ ప్రతి నిధులు దొనకొండ ప్రాంతాన్ని పరిశీలించి అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు తో సమావేశమై పరిశ్రమల ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఇక్కడ భూముల లభ్యత, నీటి సౌకర్యం ప్రభుత్వం కల్పించే రాయితీల గురించి వివరించారు. దీంతో విదేశీ కంపెనీలు వచ్చేస్తాయని అంతా భావించారు. 



ఇదే సమయంలో ఎన్నికలు రావటంతో విదేశీ కంపెనీలు విరామం తీసుకున్నాయి. దొనకొండలో పారిశ్రామిక కారిడార్ మూతపడ్డ బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయ పునరుద్ధరణకు గల అవకాశాల గురించి గత టీడీపీ ప్రభుత్వం సర్వేకు ఆదేశించింది. దీంతో నిరుపయోగంగా ఉన్న ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు పలుమార్లు సర్వేలు చేపట్టారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో నూట ముప్పై ఐదు ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించగా ఇప్పటి అవసరాల రీత్యా మరి కొంత భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్టుకు అవసరమైన నూట ముప్పై ఆరు ఎకరాల స్థలం ఇక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించామని మినీ ఎయిర్ పోర్టుకు అనుకూలంగా ఉందని, అప్పట్లో అధికారులు అభిప్రాయపడ్డారు. 



ఇదిలా ఉంటే దొనకొండ నుంచి వినుకొండకు పారిశ్రామిక కారిడార్ ను మార్చే ప్రతిపాదన వస్తే ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు వస్తాయని విషయాలపై పలువురు వైసీపీ నేతలు, పారిశ్రామికవేత్తలు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితే వస్తే ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జిల్లా తీవ్ర వివక్షకు గురైందని ఇప్పుడు కూడా దొనకొండ పారిశ్రామిక కారిడార్ ను వినుకొండకు తరలిస్తే జిల్లా ప్రజలు తీవ్రంగా నష్ట పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొనకొండ లోని నలభై ఐదు వేల ఎకరాల్లో ఇండస్ర్టియల్ కారిడార్ ఏర్పాటు చెయ్యాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పలు విదేశీ కంపెనీలు ఈ ప్రాంతంలో ఇప్పటికీ పర్యటిస్తున్నాయి. 



అయితే ప్రతిపాదిత పారిశ్రామిక కారిడార్ ను వినుకొండకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామాయపట్నం పోర్టు, కనిగిరి దగ్గర నిమ్స్, పేపర్ పరిశ్రమ, దొనకొండ పారిశ్రామిక కారిడార్ వంటి ప్రాజెక్టులు నేటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అంటున్నారు. పారిశ్రామిక కారిడార్ ను వినుకొండకు తరలిస్తున్నారన్న ప్రచారం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందంటున్నారు స్థానిక నేతలు దొనకొండలోనే పారిశ్రామిక కారిడార్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ ను తరలిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలను తొలగించాలని వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: