భారత్ పై మసూద్ అజహర్ కక్ష ఏ స్థాయిలో ఉందో తెలుసా?

‘మే -1- 2019, ఈ తేదీ ప్రతి భారతీయుడికి గుర్తుండి పోతుంది. అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ను భారత్‌ దెబ్బకొట్టి,  జైష్‌ ఎ మహ్మద్‌, ముఠాధిపతి మౌలానా మసూద్‌ అజహర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించిన రోజుగా మిగిలిపోతుంది. 

పుల్వామాలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను బలితీసుకోవడం సహా భారత్‌లో అత్యంత హేయమైన ఉగ్ర దాడులకు పన్నాగాలు పన్నిన జైష్‌ ఎ మహ్మద్‌ ముఠాధిపతి మౌలానా మసూద్‌ అజార్‌ నిజానికి చాలా భయస్తుడట. 1994లో భారత్‌లో అరెస్టు అయిన అతడు ఓ సైనికాధికారి కొట్టిన దెబ్బకు గజగజా వణికి పోయాడు. నిఘా అధికారులు పెద్దగా శ్రమ పడకుండానే ఉగ్రవాద ముఠాల గుట్టు మొత్తాన్ని విప్పాడు.

పోర్చుగీసు పాస్‌పోర్టును ఉపయోగించుకొని అజార్‌ బంగ్లాదేశ్‌ గుండా భారత్‌లోకి ప్రవేశించాడు. 1994లో కశ్మీర్‌ చేరుకున్నాడు. అక్కడ పరస్పరం ఘర్షణ పడుతున్న ఉగ్రవాద ముఠాలు హర్కతుల్‌ ముజాహిదీన్‌ (హెచ్‌యూఎం), హర్కతుల్‌ జిహాదీల (హుజీ) తో సమావేశాలు నిర్వహించి ఒక ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేశాడు. అదే ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ కశ్మీర్‌ లోని అనంత్‌నాగ్‌లో అరెస్టయ్యాడు. కస్టడీ లో అతడిని ఐపీఎస్‌ అధికారి అవినాశ్‌ మొహానానే విచారించాడు. ఆ అనుభవాలను ఆయన తాజాగా వెల్లడించారు. 

ఆయన చెప్పిన వివరాల ప్రకారం పోలీసుల కస్టడీలో నిఘా సంస్థలు అతడి నుంచి సమాచారం రాబట్టేందు కు తీవ్రస్థాయి విధానాలకు దిగలేదు. ఒక సైనికాధికారి కొట్టిన ఒకే ఒక్క చెంపదెబ్బకు వివరాలు మొత్తం కక్కేశాడు. పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద ముఠాల రిక్రూట్‌మెంట్‌, ఇతర అంశాల గురించి లోతైన వివరాలు చెప్పేశాడు. అఫ్గాన్‌ ఉగ్రవాదులను కశ్మీర్‌కు మళ్లించడం  హెచ్‌యూఎం, హుజీ లను విలీనం చేసి హర్కతుల్‌ అన్సార్‌ ఏర్పర్చడం గురించి వివరించాడు. కాలి నడకన నియంత్రణ రేఖను తాను దాట లేని అశక్తత వల్ల పోర్చుగీసు పాస్‌పోర్టుపై భారత్‌లోకి అడుగుపెట్టినట్లు చెప్పాడు. 

ఏ ప్రశ్న అడిగినా చాలా వివరంగా సమాధానం చెప్పాడు. 1993లో అజార్‌ కరాచీలో సదా ఎ ముజాహిద్‌ అనే పత్రిక లో విలేకరిగా పనిచేశాడు. అప్పుడు పలుదేశాల్లో పర్యటించి, కశ్మీర్‌పై మద్దతు కోరాడు. తనను ఎక్కువ కాలం కస్టడీలో ఉంచలేరని, పాకిస్థాన్‌కు, దాని నిఘా సంస్థకు తాను చాలా ముఖ్యమని అతడు అప్పట్లో పోలీసుల కు చెబుతుండే వాడు. అందుకు అనుగుణంగా అతడి అరెస్టు తర్వాత 10 నెలలకు కొందరు విదేశీయులు అపహరణకు గురయ్యారు. 

అజార్‌ను విడుదల చేయాలని కిడ్నాపర్లు డిమాండ్‌ చేశారు. అయితే ఒమర్‌ షేక్‌ అనే ఉగ్రవాది అరెస్టుతో ఈ పన్నాగం విఫలమైంది. 1995 జులైలోనూ ఇలాంటి కిడ్నాప్‌ డ్రామా జరిగింది. 1999లో ఉగ్రవాదుల ప్రయత్నం ఫలించింది. నాడు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని కాందహార్ లో హైజాక్‌ చేసి, అతడిని విడిపించు కున్నారు. అనంతరం అతడు జైష్‌ ఎ మహ్మద్‌ అనే ఉగ్రవాద ముఠాను ఏర్పాటు చేసి, భారత్‌లో అనేక ఉగ్రవాద దాడులు చేయించాడు. పార్లమెంటు, పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం, జమ్మూ, ఉరీ వంటివి ఇందులో ఉన్నాయి.

జమ్మూ కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 44 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసింది తామేనని పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటించడంతో ఆ సంస్థ ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. భారత్‌లో ఎప్పుడు ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా ఈ ముష్కర సంస్థ పేరు వార్తల్లోకి వస్తూనే ఉంది. భారత్ అంటే విద్వేషం, కశ్మీర్‌ భారత్ నుంచి విడగొట్టి పాక్‌లో కలపాలన్న లక్ష్యంతో పురుడు పోసుకున్న ఈ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్. రక్తం తాగే నరరూప రాక్షసుడైన ఇతని రాక్షస చరిత్ర ఒక్కసారి గమనిస్తే మౌలానా మసూద్ అజహర్ పాకిస్తాన్‌ లోని పంజాబ్ బహవల్‌పూర్‌ లో జన్మించాడు.

తండ్రి అల్లా బకాష్ షబ్బీర్ ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసేవాడు. డైరీ, కోళ్ల పెంచే వృత్తితో కుటుంబం జీవనం సాగిస్తోంది. 21 ఏళ్ల వయసు లో హర్కాత్ ఉల్ ముజాహుద్దీన్ నాయకుల ప్రభావంతో జిహాద్ ఆకర్షితుడై ఉగ్రవాదం వైపు వెళ్లాడు. దీనిలో భాగంగా ఆఫ్గన్‌లోని యువార్ టెర్రరిస్ట్ క్యాంపులో శిక్షణ పొందాడు.


అయితే నైపుణ్యం సంపాదించక పోవడంతో అక్కడి టెర్రరిస్టు గ్రూప్ మసూద్‌ను కరాచీ తిప్పి పంపింది. అనంతరం ఉపాధ్యాయుడిగా మారి మతబోధనలు చేస్తూ, ఒక వారపత్రికను నడిపేవాడు. జర్నలిస్టుగా తిరుగుతూ, 1994లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి భద్రతా దళాల చేతికి చిక్కాడు. అక్కడ శిక్ష అనుభవిస్తుండగా 1999లో పాక్ ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ విమానాశ్రయానికి తరలించారు. విమానంలో ఉన్న 155 మంది ప్రయాణికులు బందీలుగా చిక్కడంతో ఉగ్రవాదుల డిమాండ్లకు తలొగ్గిన భారత ప్రభుత్వం మసూద్‌తో పాటు మరో ఇద్దరు కరడు గట్టిన ఉగ్రవాదులను విడుదల చేసింది.

భారత్ అంటే వ్యతిరేకత ఉన్న మసూద్ మనదేశంలో విధ్వంసం సృష్టించడానికి ‘‘జైష్ ఏ మొహమ్మద్’’ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మత ప్రచారంతో పాటు యువత లో భారత వ్యతిరేకతను నింపేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో అజార్ దిట్ట. 2001లో పార్లమెంట్‌పై దాడితో జైషే మొహమ్మద్ సంస్థ వెలుగులోకి వచ్చింది. దానితో పాటు తన సహచరుడు ఒమర్ షేక్‌తో కలిసి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తున్నాడు. భారత్‌తో పాటు పలు నిఘా సంస్థల నుంచి ముప్పు పొంచి వుండటంతో అతను తన స్వగ్రామం బహవల్ పూర్‌లో గడిపాడు. భారత్‌ తో పాటు ప్రపంచదేశాల ఒత్తడి మేరకు పాక్ ప్రభుత్వం మసూద్‌ ను ఉగ్రవాదిగా గుర్తించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: