ముమ్మిడివరంలో మూడు ముక్క‌లాట‌... ఎడ్జ్ ఎవ‌రికంటే...

VUYYURU SUBHASH
తూర్పుగోదావరిలో ముక్కోణపు ఫైట్ జరిగే అవకాశం ఉన్న మరో నియోజకవర్గం ముమ్మిడివరం. బాలయోగీశ్వరుడి ఆశ్రమం నెలకొన్న ముమ్మిడివరంలో ప్ర‌ధానంగా మూడు పార్టీల మ‌ధ్య పోరు హోరా హోరీగా సాగ‌నుంది. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి దాట్ల సుబ్బ‌రాజు విజ‌యం సాధించారు. అయితే, గ‌డిచిన ఐదేళ్ల‌లో ఇక్క‌డి రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా వైసీపీలో, జ‌న‌సేన‌లో మార్పులు భారీగా జ‌రిగాయి. దీంతో ఇక్క‌డ త్రిముఖ పోటీ ఖాయ‌మ‌ని తేలిపోయింది. టీడీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), వైసీపీ నుంచి పొన్నాడ సతీశ్‌కుమార్‌, జనసేన నుంచి పితాని బాలకృష్ణ బరిలో ఉన్నారు.


గత ఐదేళ్ల‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న దాట్ల సుబ్బ‌రాజు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డం ఆయ‌న‌కు ప్ర‌ధానంగా క‌లిసి వ‌స్తున్న అంశం. ముఖ్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపించారు. అలాగే రైతుల‌కు, మ‌హిళా సంఘాల‌కు ఆయ‌న ప్ర‌భుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకున్న తీరు, ఎన్టీఆర్ గృహాలు వంటివి కూడా ఆయ‌న‌కు ప్ల‌స్‌గా మారుతున్నాయి. దీనికితోడు గ‌త ఎన్నిక‌ల్లో సుబ్బ‌రాజుపై వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన గుత్తుల సాయి.. ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి .. ప్ర‌స్తుతం దాట్ల‌కు మ‌ద్ద‌తిస్తున్నారు.


ఈ ప‌రిణామం వైసీపీ అభ్యర్ధి సతీశ్‌కి కొంత మేర‌కు ఇబ్బంది క‌లిగిస్తోంది. కానీ జగన్ పాదయాత్ర.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పొన్నాడకి ప్లస్ కానుంది. అలాగే పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లి బలపడ్డారు. అయితే, ఇదే వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి జనసేన నుంచి పోటీ చేస్తున్న మాజీ కానిస్టేబుల్ పితాని బాల‌కృష్ణ  వైసీపీ త‌న‌ను న‌మ్మించి మోసం చేసింద‌నే ప్ర‌చారం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ అనుచ‌రుల‌ను, వైసీపీ వ్య‌తిరేకులు, ప్ర‌భుత్వ పార్టీ అసంతృప్త ప‌రులు త‌న‌కు క‌లిసి వ‌స్తార‌ని ఆయ‌న భావిస్తున్నారు. అలాగే తన సామాజికవర్గం అయిన శెట్టిబలిజలు ఇక్కడ ఎక్కువ ఉండటం, అలాగే పార్టీకి అండగా ఉండే కాపు ఓటర్లు ఎక్కువ ఉండటం ప్లస్. కానీ తెదేపా-వైకాపాలకీ ఉన్న కేడర్ జనసేనకి లేకపోవడం మైనస్.


మొత్తం మీద 3 పార్టీల నడుమ త్రిముఖ పోరు నెలకొంది. ఇక బుచ్చిబాబు క్షత్రియ, సతీశ్‌ అగ్నికుల క్షత్రియ (మత్స్యకార), బాలకృష్ణ శెట్టిబలిజ సామాజికవర్గాలకు చెందినవారు. ఈ నియోజకవర్గంలో ఐలాండ్ పోలవరం, ముమ్మిడివరం, తాళ్ళరేవు, కాట్రేనికోన మండలాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత శెట్టిబలిజ, మత్స్యకార, కాపు ఓటర్లు ఉన్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును మత్స్యకార, ఎస్సీ ఓటర్లు నిర్ణయిస్తూ వస్తున్నారు. మరి ఈ సారి జరిగే త్రిముఖ పోరులో వీరు ఎవరి వైపు మొగ్గుచూపుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: