పాపం కమల్ హాసన్..! కొబ్బరికాయ కొట్టకముందే పార్టీలో ఝలక్ లు..!!

Vasishta

సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఆరంభంలో ఎదురుదెబ్బలు సహజమే. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని స్టేజ్ లో తీసుకునే అసంబద్ద నిర్ణయాల వల్ల ఒడిదుడుకులు సహజమే. ఇప్పుడు తమిళనాడులో కమల్ హాసన్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. పార్టీ ఇంకా తొలి ఎన్నికలకు కూడా వెళ్లకముందే కోర్ కమిటీలో మనస్ఫర్థలు మొదలయ్యాయి.

 

సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యం అధినేత  కమలాహాసన్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎంఎన్ఎం కోర్ కమిటీ సభ్యుడు కుమారవేల్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అంతర్గత రాజకీయాల కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్టు కుమారవేల్ ప్రకటించడంతో కమాలాహసన్ షాక్ కు గురయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీలో కీలకంగా ఉన్న నేత పార్టీని వీడటంతో తమిళ రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది.

 

కమలాహాసన్ స్థాపించిన పార్టీలో అధ్యక్షుడి వ్యవహారశైలి చాలామందికి రుచించడం లేదనే భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఆఫీస్ బేరర్లు, కమలాహాసన్ మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు ఇద్దరి మధ్య మరింత అగాథాన్ని పెంచుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు పార్టీ కార్యకర్తలకు సమచారం ఇవ్వకుండా కేవలం వాట్సాప్ సందేశాలకే పార్టీ అధ్యక్షులు పరిమితమయ్యారనే వాదనలు ఉన్నాయి. పార్టీ కార్యకలాపాలను తాము వాట్సాప్ ద్వారానే తెలుసుకోవాల్సి వస్తోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే కమలాహసన్ వాదన మరోలా ఉంది. ఎంఎన్ఎం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నానంటూ కుమారవేల్ సొంతంగా ప్రకటించుకుని పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందునే పార్టీ నుంచి తప్పించినట్లు ఆయన చెబుతున్నారు.వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించాలని ఎంఎన్ఎం నిర్ణయం తీసుకుంది. మార్చి 11 తేదీనే కుమారవేల్ సోషల్ మీడియా వేదికగా ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని ప్రకటించారు. కడలూర్ నియోజకవర్గం నుంచి ఎంఎన్ఎం అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

 

కుమార్ వేల్ తీసుకున్న నిర్ణయం తమిళనాట రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను ప్రకటించే సమయంలో కుమార్ వేల్ తీసుకున్న నిర్ణయం సరైన పద్దతి కాదని ఆ పార్టీలోని నాయకులే ఖండిస్తున్నారు. పార్టీ అధినేత అనుమతి లేకుండా తీసుకున్న నిర్ణయాలు మక్కల్ నీధి మయ్యం పార్టీలోని నాయకులను కలవర పరుస్తోంది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మారుతున్న సమీకరణలు ఏ మలుపు తిరుగుతాయోననే చర్చ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: