ఎడిటోరియల్ : చంద్రబాబుకు సునీత షాక్.. ఇంతకీ అభ్యర్ధెవరు ?

Vijaya

టికెట్ల కేటాయింపులో పలువురికి చంద్రబాబునాయుడు షాకిస్తుంటే మంత్రి పరిటాల సునీత మాత్రం చంద్రబాబుకే షాకిచ్చారు.  రాబోయే ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత  పోటీ చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, తన తరపున తన కొడుకు పరిటాల శ్రీరామ్ పోటీ  చేస్తారని బహిరంగంగా సునీత చేసిన ప్రకటనతో సిఎం ఖంగుతిన్నారు.

 

ఇంతకీ ఏం జరిగిందంటే రాబోయే ఎన్నికల్లో తనతో పాటు తన కొడుకు శ్రీరామ్ ను కూడా పోటీ చేయించాలని సునీత పట్టుదలగా ఉన్నారు. అందుకనే తాను రాప్తాడులోను శ్రీరామ్ కల్యాణదుర్గంలో పోటీ చేయటానికి వీలుగ రెండు టికెట్లు కేటాయించమని అడుగుతున్నారు. చాలాకాలంగా ఇదే విషయమై చంద్రబాబును సునీత ఒత్తిడి పెడుతున్నారు.

 

రాబోయే ఎన్నికలు చాలా కీలకం కాబట్టి వారసులకు టికెట్లు ఇవ్వటం కుదరదనే సాకుతో చంద్రబాబు తప్పించుకుంటున్నారు. అయితే, అనంతపురం ఎంపిగా జేసి దివాకర్ రెడ్డికి బదులుగా కొడుకు జేసి పవన్ రెడ్డి, తాడిపత్రిలో ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డికి బదులు కొడుడు జేసి అస్మిత్ రెడ్డికి మాత్రం చంద్రబాబు ఓకే చెప్పారు. దాంతో సునీతకు మండిపోయింది.

 

రాజకీయంగా తన ప్రత్యర్ధుల వారసులకు టికెట్లిచ్చి తన కొడుకుకు మాత్రం టికెట్ లేదని చెప్పటాన్ని సునీత తట్టుకోలేకపోయారు. దాంతో చంద్రబాబుపై మరింత ఒత్తిడిని పెంచారు. అయినా చంద్రబాబు కుదరదని చెప్పటంతో రాప్తాడులో తాను పోటీ  చేయనని సునీత తెగేసి చెప్పారు. తనకు బదులుగా శ్రీరామ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ సునీత ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.

 

తాను సునీతకు టికెట్ ఇస్తే తనకు చెప్పకుండానే మంత్రి మాత్రం తన కొడుకే పోటీ చేస్తాడని నియోజకవర్గంలో బహిరంగంగా ప్రకటన చేయటంతో పాటు ప్రచారం కూడా మొదలుపెట్టేయటంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది. దాంతో ఏం చేయాలో  చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు. శ్రీరామ్ ను పోటీ నుండి తప్పుకోమని చెబితే సునీతకు కోపం. అలాగని శ్రీరామ్ ను పోటీకి అనుమతిస్తే ఇదే పద్దతిలో మిగిలిన నేతలు కూడా అనుసరిస్తారేమోననే ఆందోళన. మొత్తానికి చంద్రబాబును సునీత భలే ఇరుకున పడేసింది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: