చినబాబు సీటెక్కడ....?

Madhu Shree
సాధారణంగా పార్టీ అధినేతలు, వారి పిల్లలు ఎక్కడ పోటీ చేయాలన్నది చాలా ముందుగానే డిసైడైపోతుంది. ప్రకటించడమే లాంఛనం అనుకోవాలి. కానీ అదేంటో ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ బాబుకు మాత్రం సీటు దొరకడం లేదు. ఎక్కడ పోటీ చేస్తే అబ్బాయిని గట్టెక్కించొచ్చో చంద్రబాబుకే అర్థం కావడం లేదు.గుంటూరు జిల్లాలో కొన్ని సీట్లను చినబాబు కోసం పరిశీలించారు. ఓ దశలో లోకేష్ పెదకూరపాడు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగింది. కానీ అది కుదరలేదు. దీంతో ఉత్తరాంధ్రలో సేఫ్ సీట్ కోసం గాలించారు. 


భీమిలి సీటును పరిశీలించినట్లు చెబుతున్నారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం  ఖాయం కావడంతో ఆ సీటును ఆయనకు కేటాయిస్తున్నారు. దీంతో విశాఖ ఉత్తరం పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు దానిపైనా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. అది అంత సేఫ్ కాదేమోనన్న టెన్షన్ పార్టీ అధినాయకత్వంలో ఉందంటున్నారు. పైగా పవన్ గాజువాక నుంచి పోటీ చేస్తారన్న మరో ప్రచారమూ జరుగుతోంది. అదే జరిగితే దాని ప్రభావం లోకేష్ పై పడుతుందన్న భయం పార్టీ నేతలకు ఉంది.


సీటు ఇస్తే ఖచ్చితంగా గెలవాలి. లేకపోతే పోయేది లోకేష్ పరువు కాదు చంద్రబాబు పరువు. అందుకే బాబుకు అంత భయం పట్టుకుంది. పోనీ ఈ ఎన్నికల వరకూ పోటీ నుంచి విరమింప చేద్దామా అంటే అదీ కుదిరేలా లేదు. ఎలాగైనా పోటీ చేయాల్సిందేనని చినబాబు గట్టి పట్టుతో ఉన్నాడట. పైగా ఇంత ప్రచారం జరిగాక లోకేష్ పోటీ చేయకపోతే అది కేడర్ లోకి మరింత చెడు సంకేతాలు పంపుతుందేమోనన్న టెన్షన్ చంద్రబాబుకి పట్టుకుంది. పాపం అందరికీ సీట్లు ఖరారు చేయడం ఓ ఎత్తైతే.. లోకేష్ కు సీటు అడ్జస్ట్ చేయడం మరో ఎత్తు...



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: