మాట్లాడుకుందాం రా! అంటున్న పాక్ ప్రధాని-72 గంటల్లో తేల్చేద్ధాం! అంటున్న మంత్రి రషీద్!

నిన్న, నేడు ఉదయం వరకు అణుయుద్ధానికి సిద్ధం అన్న ధోరణి లో మాట్లాడిన పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత్ తో చర్చల ప్రతిపాదన చేశారు. ఇప్పుడు సహనం కోల్పోతే పరిస్థితులు తన అదుపులో కానీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ అదుపు లో కానీ ఉండవన్నారు. పుల్వామా దాడి తదనంతర పరిణామాలతో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరు కున్నాయి. ఈ తరుణంలో ఇమ్రాన్‌ ఖాన్ ఇవాళ మరోసారి శాంతి చర్చలు అంటూ కొత్తనాటకానికి తెరతీశారు. 


పుల్వామా దాడి చేసింది తామే, అని పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చెబుతున్నా, ‘‘ఆధారాలు’’ లేవంటూ కళ్లుమూసుకున్న ఆయన, తాజాగా భారత్‌ ను చర్చల కోసం ఆహ్వానించారు. ‘‘పుల్వామా ఘటన అనంతరం భారత్‌కు మేము శాంతి ప్రతిపాదన చేశాం. పుల్వామా దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలను. పలు ఆస్పత్రులను సందర్శించి, హింస కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి బాధను నేను కళ్లారా చూశాను’’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు ఇమ్రాన్ ఖాన్.
 

ఆపై నాలుక మడతేసి, పుల్వామా ఉగ్రదాడిపై విచారణ జరుపుతామని తాము ఇప్పటికే భారత్‌కు చెప్పామనీ భారత్‌కు సహకరించేందుకు తాము సిద్ధమని చెప్పామన్నారు. ‘‘భారత్ ఇప్పటికీ చర్యలు తీసుకునే యోచనలో ఉందన్న ఉద్దేశంతోనే, దాడులకు ప్రతిదాడులు ఉంటాయని చెప్పాను. నిన్న ఉదయం భారత్ మమ్మల్ని కష్టపెట్టిన ప్పటికీ మా వైమానిక దళాలను తొందరపడొద్దని చెప్పాను. భారత్ చర్యల కారణంగా జరిగిన నష్టాన్నిఅంచనా వేసేవరకు ముందుకెళ్లొద్దని సూచించాను’ అని ఆయన ఎంతో సహనం వహించినట్లు మాట్లాడారు. 
 
ఇవాళ పాక్ వైమానిక దళాలు సరిహద్దులు దాటి భారత్‌ లోకి ప్రవేశించడం పైనా ఆయన స్పందించారు. ‘‘మీరు మా దేశంలోకి అడుగుపెడితే, మేము కూడా అదే పని చేయగలమని చెప్పేందుకు మాత్రమే మేము ఈ మేరకు స్పందించాం. వాళ్లకు చెందిన రెండు మిగ్ విమానాలను కూల్చివేశాం. ఇక ఇక్కడి నుంచి మేము మరింత తెలివి గా వ్యవహరిస్తాం’’ అని ఆయన పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు.

‘‘మీ దగ్గరున్న ఆయుధాలు, మా దగ్గరున్న ఆయుధాలతో తలెత్తే ధారుణ పరిణామాలను తట్టుకోగలమా? అని నేను భారత్‌ను అడిగాను. ఇదింకా ముదిరితే, నా చేతుల్లోగానీ, మోదీ చేతుల్లో గానీ ఏమీ ఉండదు’’ అంటూ యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలను వదిలారు. పుల్వామా దాడితో భారత్‌ పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలననీ, దీనిపై దర్యాప్తు చేసేందుకు, చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని ఇమ్రాన్ పేర్కొన్నారు.



‘ఇద్దరం కలిసికూర్చుని మాట్లాడుకుందాం! చర్చలద్వారా పరిష్కరించుకుందాం!’ అని ఆయన పేర్కొన్నారు. నేడు బుధవారం ఆయన ఇస్లామాబాద్‌ లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ ప్రసంగాన్ని మీడియా ప్రసారం చేసింది, శాంతియుత వాతావరణంలో చర్చించుకొంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తాము రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టుగా ఆయన ప్రకటించారు. 

ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏం చేయాలో? తెలపాలని ఇమ్రాన్ కోరారు. పూల్వామాలో సీఆర్‌ఫీఎఫ్ దాడి ఘటన కు సంబంధించి విచారణకు కావాల్సిన సహాయాన్ని తాము భారత్కు అందిస్తామని ఆయన ప్రకటించారు. టెర్రరిజం ప్రోత్సహించడానికి తమకు ఆసక్తి లేదని  ఆయన చెప్పుకొచ్చారు. యుద్ధం ప్రారంభిస్తే ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదన్నారు. గతంలో జరిగిన యుద్ధాలన్నీ ఇలానే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

భారత్ వద్ద ఆయుధాలుంటే మావద్ద కూడ ఆయుధాలు ఉన్నాయ అంటూ నర్మగర్భ బెదిరింపు ఆయనమాటల్లో ద్వనించింది భారత్ రెచ్చగొట్టడంతో రెండు యుద్ధ విమానాలను తాము కూల్చివేసినట్టుగా ఆయన ప్రకటించారు. 

పాక్ ప్రధాని అలా శాంతి ప్రస్థావన తెస్తూ ఉంటే - భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నఈ సమయంలో మరో ప్రక్క పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు.  యుద్ధం అంటూ జరిగితే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే భయంకరంగా ఉంటుందన్నారు. అది భారత్-పాక్ మధ్య చివరి యుద్ధం కూడా కావొచ్చని అభిప్రాయపడ్డారు.  రానున్న 72 గంటలు ఇరు దేశాలకు అత్యంత కీలకమన్నారు. యుద్ధమా? శాంతా? అనేది 72 గంటల్లో తేలిపోతుందని షేక్ రషీద్ తేల్చి చెప్పారు. 


ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం పాక్‌ కు చెందిన వైమానిక దాడులను తాము సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు భారత వైమానిక దళం ప్రకటించింది. భారత ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకె కపూర్  మీడియాతో మాట్లాడుతూ, మిగ్ 21 విమానం కూలిపోయిందని చెప్పారు. అయితే పైలెట్‌ మిస్సింగ్‌ గా ఆయన ప్రకటించారు.


ఇవాళ ఉదయం భారత గగనతలంలో మూడు కిలోమీటర్ల మేరకు పాక్ విమానాలు చొచ్చుకొచ్చినట్టుగా ఆయన ప్రకటించారు. భారత మిలటరీ స్థావరాలపై దాడికి పాక్ విమానాలు వచ్చాయన్నారు. అయితే పాక్ పన్నాగాన్ని భారత దళాలు  తిప్పికొట్టాయ ని చెప్పారు. మరో వైపు ఒక మిగ్ 21 విమానం పాక్ భూభాగంలో కుప్పకూలి పోయింద ని చెప్పారు. పైలెట్ గల్లంతు అయినట్టు కూడా ధృవీకరించారు.  అయితే అదే పైలెట్ తమ ఆధీనంలో ఉన్నట్టుగా పాక్ చెప్పుకొంటుందన్నారు. ఇంకా దానిపై పూర్తి వివరాలు అందాల్సి ఉందని ఆయన ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: