పెన్షన్ రూ.3000..! చంద్రబాబుకు జగన్ ఝలక్..!!

Vasishta

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అధికార, ప్రతిపక్షాల మధ్య హామీల యుద్ధం కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం.. ఇవి చేస్తాం.. అంటూ ఇరు పక్షాలూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ తిరుపతిలో పెద్ద సంచలనమే రేపారు. అధికార పార్టీకి ఈ హామీ కచ్చితంగా ఇబ్బంది కలిగించేదే..!


వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే వృద్ధులందరికీ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.3 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. తిరుపతిలో జరిగిన సమర శంఖారావం బహిరంగసభలో ఆయన ఈ హామీ ఇచ్చారు. వాస్తవానికి తాను పాదయాత్రకు ముందు ప్రకటించిన నవరత్నాలులో పెన్షన్ ను రూ.2000 చేస్తామని హామీ ఇచ్చారు. అయితే గత నెల నుంచే అధికార తెలుగుదేశం పార్టీ పెన్షన్లంటనినీ రెట్టింపు చేసింది. అంటే ఇంతకుముందు వెయ్యి రూపాయలు వస్తున్న పెన్షన్ గత నెల నుంచి రూ.2000 అయ్యింది. దీంతో జగన్ ఈ మొత్తాన్ని మరింత పెంచుతూ రూ.3000 ఇస్తామని ప్రకటించారు.


2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వయో వృద్ధులకు రూ.200 పెన్షన్ ఉండేది. అయితే దాన్ని వెంటనే రూ.1000కు పెంచుతూ తెలగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే ఐదు రెట్లు. తాజాగా ఆ మొత్తాన్ని రూ.2000లు చేయడంతో పది రెట్లు పెంచినట్లయింది. దీంతో జగన్ నవరత్నాల సమయంలో ఇచ్చిన రూ.2000ల హామీకి విలువ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.3000లకు పెంచడంతో అధికార టీడీపీకి గట్టి సవాల్ విసిరినట్లయింది.


ఎన్నికల ముందు మాత్రమే చంద్రబాబుకు సంక్షేమం గుర్తుకు వస్తుందని, అందుకే తాను రూ.2000లు చేస్తానని మాటివ్వగానే చంద్రబాబు పెంచేశారని జగన్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు రూ.3000 లు ఇస్తామని ప్రకటించారు. అంతేకాక.. ఊళ్లలోని అవ్వాతాతలందరికీ ఈ విషయం చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరి ఈ సవాల్ ను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి. తాను కూడా మళ్లీ అధికారంలోకి వస్తే రూ.3000లు ఇస్తానని ప్రకటిస్తారా... లేక కామ్ గా ఉంటారా అనేది చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: