ఎడిటోరియల్ : పక్షాలు లేకపోయినా అఖిలపక్షమట..చంద్రబాబుకే అవమానం

Vijaya

చంద్రబాబునాయుడు విపరీత పోకడలకు అంతే ఉండటం లేదు. అందుకు తాజాగా జరిగిన అఖిలపక్ష సమావేశమే పెద్ద నిదర్శనం. చంద్రబాబు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. నిజానికి ఈ సమావేశంలో తెలుగుదేశంపార్టీ తప్ప మరో రాజకీయ పార్టీనే కనబడలేదు. వైసిపి, జనసేన, బిజెపి, వామపక్షాలే కాదు చివరకు కాంగ్రెస్ కూడా హాజరుకాలేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినందుద వల్ల చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే ఏ అఖిలపక్ష సమావేశానికి కూడా హాజరయ్యేది లేదని ప్రతిపక్షాలు దాదాపుగా తేల్చి చెప్పేశాయి ఎప్పుడో.

 

 బుధవారం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం విషయంలో  కూడా ప్రతిపక్షాలన్నీ మాట మీదే నిలబడ్డాయి. అందుకే బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా ఎవరూ పాల్గొనలేదు. మరి పాల్గొన్నదెవరయ్యా అంటే ? ప్రజాసంఘాలు, చంద్రబాబు భజన బృందాలు, ఉద్యోగ జేఏసి అంతే. ఇంత మాత్రానికే అఖిలపక్ష సమావేశం బ్రహ్మాండంగా జరిగిపోయిందంటూ చంద్రబాబు మీడియా ఒకటే ఊదరగొడుతోంది.

 

పైగా అఖిలపక్షం ఆధ్వర్యంలో చేసిన తీర్మానాలంటూ మీడియా ప్రముఖంగా ప్రచురించాయి. నిజానికి రాష్ట్రంలోని ఒక్క ప్రతిపక్షం కూడా సమావేశానికి హాజరు కాలేదంటే చంద్రబాబుకు అవమానం జరిగినట్లే. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఎంత క్రెడిబులిటీ ఉందో తెలిసిపోతోంది. ఇదే అంశాలపై గతంలో అఖిలపక్ష సమావేశాలు పెట్టమని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు ఎవరినీ ఖాతరు చేయలేదు. రాజధాని నిర్మాణానికి స్ధలం నిర్ణయం, హుద్ హుద్ తుపాను, కరువు, ప్రత్యేకహోదా, విభజన హమీల అమలు ఇలా చాలా అంశాలపైనే అఖిలపక్ష సమావేశాలు పెట్టమన్నపుడు చంద్రబాబు పట్టించుకోలేదు.

 

రాష్ట్ర ప్రయోజనాలు, సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ఆధ్వర్యంలోనే అఖిలపక్ష పక్షాన్ని తీసుకుని ప్రధానమంత్రిని కలుద్దామని జగన్మోహన్ రెడ్ది చాలా సార్లే చంద్రబాబును అడిగినా ఉపయోగం కనబడలేదు. రాష్ట్రంలో అసలు సమస్యలే లేవన్నారు. ఏపి అభివృద్ధికి కేంద్రం బ్రహ్మాండంగా సహకరిస్తుంటే మళ్ళీ అఖిలపక్ష సమావేశాలు ఎందుకంటూ ప్రతిపక్షాలకు అప్పట్లో చంద్రబాబు ఎదురుతిరిగారు. ఎప్పుడైతే చంద్రబాబుకు ప్రధానమంత్రితో వ్యక్తిగతంగా చెడిందో వెంటనే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు.

 

ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో వెంటనే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ యు టర్న్ తీసుకున్నారు. అప్పటి నుండి కేంద్రంతో పోరాటమంటూ అఖిలపక్ష సమావేశలు మొదలుపెట్టారు. దాంతో ఒళ్ళుమండిన ప్రతిపక్షాలు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేది లేదని ఎదురుతిరిగాయి. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు ఒంటరైపోయారు. తాజా సమావేశంలో జరిగింది కూడా అదే. రాష్ట్రంలోని ప్రతిపక్షాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సమావేశానికి హాజరుకాలేదంటే చంద్రబాబుకే అవమానం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: