సంక్రాంతి వేళ పల్లెకి వెళ్తే.. ఇవి చూడకుండా తిరిగిరాకండి..!?

Chakravarthi Kalyan
సంక్రాంతి అంటే పిల్లలకు సందడే. కనీసం వారం రోజులకు తక్కువ కాకుండా సెలవులు దొరుకుతాయి. అందుకే అంతా తమ పల్లెలకు పయనమవుతారు. అందులోనూ సంక్రాంతి వేళ ఉన్నంత సందడిగా పల్లెటూరు ఎప్పుడూ ఉండదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే చాలామందికి మరపురాని జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి.

ఐతే.. సంక్రాంతిని కేవలం పండుగగానే చూడకుండా ఈతరం విద్యార్థులకు పాత తరాన్ని పరిచయం చేసే అవకాశంగా కూడా మలచుకోవచ్చు. పల్లెటూళ్లలో పాతకాలం వస్తువులు ఇంకా చాలావరకూ సజీవంగానే ఉంటాయి. ఇప్పుడంటే అన్నీ విద్యుత్ ఉపకరణాలు వచ్చాయి కానీ పాతకాలంలో అన్ని పనులు సొంత సామగ్రితోనే చేసేవారు కదా.



అందుకే పిల్లలకు అవేమిటో చూపించాలి. నగరాల్లోని ఇళ్లలో ట్యాప్ తిప్పగానే నీళ్లు రావడమే తెలిసిన విద్యార్థులకు గ్రామాల్లో బావుల్లోని నీటిని గిలకల మీదుగా చేదుతారన్న విషయం ప్రత్యక్షంగా చూపించాలి. కిచెన్‌లో మిక్సీ, గ్రైండర్ వంటి ఉపకరణాలతో చేసే పనులను పల్లెల్లో ఇసుర్రాయి, రోలు, రోకలితో ఎలా చేస్తారో చూపించాలి.



గ్యాస్ వంటలకు అలవాటు పడిన పిల్లలకు కట్టెల పొయ్యిలు, కుంపట్లు ఎలా పనిచేస్తాయో వివరించాలి. అలాగే పాలు, పెరుగు నిల్వచేసేందుకు వాడే ఉట్లు, వెన్న చిలికే కవ్వాలు, బియ్యం చెరిగే చాటలు, కూర్చునే పీటలు.. ఇలా పల్లెటూరి పరికాలను పరిచయం చేయాలి. విద్యుత్ పై ఆధారపడకుండానే పాతకాలంలో పల్లెలు ఎలా జీవనం సాగించాయో వివరించాలి. ఏమంటారు..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: