కుడితిలో పడ్ద ఎలుక కాంగ్రెస్

శబరిమల ఆలయంలోకి ఇద్దరు 50ఏళ్ల లోపు మహిళల ప్రవేశాన్ని తప్పుపడుతూ ఒక వైపు కేరళలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. శబరిమల కర్మ సమితి పిలుపునిచ్చిన ధర్నాలో కేరళ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఇద్దరు కాంగ్రెస్ కార్యర్తలు సీఎం పినరయి విజయన్ కాన్వాయ్‌ కు అడ్డుపడగా, వారిని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డారు.


అయితే, వీటన్నిటికంటే ముందే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారట. ఈనెల 2న ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారని విషయం తెలిసిన తర్వాత ఆ రోజు బ్లాక్-డే గా పాటించాలని హస్తం నేతలు ప్రతిపాదించారు. ఎలాగూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి చేతికి నల్ల రిబ్బన్లతో లోక్‌సభకు హాజరు కావాలని భావించారు. కొందరు ఎంపీలు నల్ల రిబ్బన్లను తీసుకొచ్చి అందరు కాంగ్రెస్ ఎంపీలకు పంచుతుండగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అక్కడకు వచ్చారట. వారిని చూసి ఇలాంటివి వద్దని వారించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ లింగ సమానత్వానికి, మహిళల హక్కులకు కట్టుబడి ఉంటుంది అని కాంగ్రెస్ ఎంపీలకు సోనియాగాంధీ క్లాస్-పీకినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది.


సోనియాగాంధీ మనసులో మాట తెలియ గానే కాంగ్రెస్ ఎంపీలు తమ అభిప్రాయాన్ని మార్చుకుని నల్లరిబ్బన్ల ప్రతిపాదనను వదిలేశారు. అయితే, కేరళలో సీఎం పినరయి విజయన్‌ ను టార్గెట్ చేస్తూ విరుచుకు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిపక్షనేత రమేష్ చెన్నితల కు షాక్‌గా మారింది. శబరిమల ఆలయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ సీఎం పినరయి విజయన్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆలయ పూజారి, సంప్రోక్షణ చేయడాన్ని ఆయన పూర్తిగా సమర్థించారు. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వివాదంపై బ్యాలెన్స్‌గా వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: