ఆలయాల్లో పక్షులు..దేవుడి లీలలు అంటున్న భక్తులు!

Edari Rama Krishna
ప్రపంచంలో దేవుడు ఉన్నాడా? లేడా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరై సరైన సమాధానం ఇవ్వలేదు. కానీ మనిషి మాత్రం దైవభక్తితో ఎన్నో రకాల దేవుల్లకు పూజలు చేస్తూ ఉంటారు.  దేవుడు అంటే..భక్తి, భయం అందుకే ప్రపంచంలో ఎన్నో ఆలయాలు వెలిశాయి. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి..ఆయా మతస్థులు దైవాన్ని తమ పద్దతుల్లో పూజిస్తుంటారు.  ఇక భారత దేశంలో భక్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు.  అందుకే ఇక్కడ అన్ని రకాల దేవుళ్లకు దేవాలయాలు ఉన్నాయి.  ఇక్కడ భక్తులు దేవుళ్లపై ఎంతో నమ్మకాన్ని ప్రదర్శిస్తుంటారు..అప్పుడప్పుడు దేవుడు కొన్ని లీలలు చూపిస్తున్నారని గట్టిగా నమ్ముతుంటారు..ఇది ముమ్మాటికీ దైవ సంకల్పమే అంటారు. 

గత  మూడు రోజుల నుంచి తెలంగాణలోని దేవాలయాల్లో వింత పక్షులు రావడం..వాటికి పూజలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని విగ్రహం వద్ద ఓ గరుడపక్షి  రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.  విష్ణుమూర్తి కి గరుడవాహనం ఉంటుందని..ఆ గడుడ పక్షే స్వామి వారిని పూజించేందుకు ఇక్కడకు వచ్చిందని ఆలయ పూజారులు విశ్వసిస్తున్నారు.  భక్తులు దీన్ని దేవుని మహిమగా భావిస్తూ, ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా, నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, కేసుపల్లి శివాలయంలో పిచుకను పోలిన వింతపక్షి ఒకటి, శివలింగం ముందు తిరుగుతూ, అక్కడి నుంచి కదలకపోవడం కెమెరాలకు చిక్కింది.  మిర్యాలగూడ సమీపంలోని ఓ ఆలయం గర్భగుడిలోకి కూడా ఓ పక్షి వెళ్లగా, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు.  అయితే ఇదంతా దేవుడి లీలలు అంటూ భక్తులు కొలుస్తుంటే..అనుకోకుండా గుడిలోకి వెళ్లిన పక్షులకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని నాస్తికులు కొట్టి పడేస్తున్నారు.  కాగా, కోరుట్లలో దర్శనమిచ్చిన గరుడపక్షి ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల సంరక్షణలో ఉండగా, జక్రాన్ పల్లి ఆలయంలోని పక్షి విషయాన్ని అధికారులకు చేరవేశారు స్థానికులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: