కేసీఆర్.. మరీ ఇంత అరాచకమా..?

Chakravarthi Kalyan

తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తెలంగాణతో పాటే ఎన్నికలు జరిగిన మిగిలిన రాష్ట్రాల్లో మంత్రివర్గాలు కొలువుదీరుతున్నాయి. కానీ తెలంగాణలో ఇంకా ఆ ఊసే ప్రారంభం కాలేదు. సీఎంతో పాటు మరో మంత్రి మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నది ఇంకా స్పష్టత లేదు.



సాధారణంగా ఎన్నికలు జరిగిన వెంటనే సీఎం ప్రమాణ స్వీకారం చేసి.. వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. మహా అయితే వారం రోజుల్లో మంత్రి వర్గం కొలువుదీరుతుంది. కానీ ప్రస్తుతం కేసీఆర్‌ ప్రాంతీయ పార్టీలను కూడగట్టే మహత్కార్యంపై దేశవ్యాప్త పర్యటనలో ఉన్నారు.



కాబట్టి సీఎం రాష్ట్రంలో లేరు. మిగిలిన మంత్రివర్గమూ లేదు. ప్రస్తుతం ఉన్నది హోంమంత్రి ఒక్కరే. బహుశా ఇలాంటి విచిత్రమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేకపోవచ్చు. నేను ఉంటే సరిపోతుంది.. ఇంకా మిగిలిన మంత్రివర్గంతో పనే ముంది.. వారి నియామకానికి తొందరేముంది అన్నట్టుగా ఉంది గులాబీ బాస్ పరిస్థితి.



ప్రస్తుతం తెలంగాణలో పాలన అంతా అధికారుల చేతుల్లోనే ఉంది. ఐతే.. గతంలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదనుకోండి. మంత్రులు ఉన్నా నిర్ణయాలన్నీ కేసీఆర్ ఆదేశాల మేరకే ఉండేవి కాబట్టి పెద్ద తేడా లేకపోయినా.. అసలు మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోకుండా వారాల తరబడి గడపడం ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంకేతాలు ఇస్తుందన్నదే ప్రధానం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: