తెలంగాణలో పోలింగ్ శాతం.. ఎవరి కొంపముంచుతుందో ..?

Chakravarthi Kalyan

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా దాదాపు సజావుగానే సాగింది. గత ఎన్నికల్లో 69 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి కూడా దాదాపు అంతే శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకూ వచ్చిన సమాచారం ప్రకారం పోలింగ్ 67 శాతంగా ఉంది.



సాయంత్రం ఐదు గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం.. నర్సంపేటలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ జరిగింది. ఇక అతితక్కువగా యాకుత్ పూరాలో 33 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 76 శాతం, జగిత్యాల జిల్లాలో 74 శాతం, పెద్దపల్లి జిల్లాలో 62 శాతం, నాగర్ కర్నూలు 73 శాతం ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ లో పలుచోట్ల పోలింగ్ శాతం 50 దాటలేదు.


ఈ ఎన్నికల్లో కూడా పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, ఓట్ల గల్లంతు వంటి ఇబ్బందులు తప్పలేదు. మొత్తం 754 బ్యాలెట్ యూనిట్లను ఈసీ అధికారులు మార్చాల్సి వచ్చింది. దాదాపు 1444 చోట్ల వీవీప్యాట్ యంత్రాలను మార్చారు. ఐతే.. ఇవన్నీ మానవ తప్పిదాల కారణంగానే మార్చాల్సి వచ్చిందని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ శాతం పెద్దగా మారకపోవడం కూడా విశ్లేషకులను ఆశ్చర్యంలో పడేసింది. ఎటువైపు కూడా పెద్దగా గాలి వీయకపోవడం వల్ల ఫలితాలను అంచనా వేయడం వారికి కష్టంగా మారింది. పోలింగ్ శాతం భారీగా లేకపోవడంతో అధికార పార్టీ కాస్త ఊపిరిపీల్చుకుంది.



ఈ ఎన్నికల్లో ఈసీ అధికారులు మొత్తం 138 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన 5.4 లక్షల లీటర్ల మద్యం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓట్ల గల్లంతు విషయంపై స్పందించిన ఈసీ ఓటర్లు ముందుగా తమ ఓటు ఉందో లేదో చూసుకోకపోవడం వల్ల చాలా చోట్లల ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు 2015లో గల్లంతైందని.. ఆ తర్వాత ఆమె 2016, 17, 18 జాబితాల సవరణ సమయంలో పేరు నమోదు చేసుకోలేదని తెలిపారు. ఏదేమైనా ఈ విషయంపై దర్యాప్తు జరిపిస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: