వారసత్వం కుటుంబం కులజనం బందుగణం ఇద్దరు చంద్రులకు ముఖ్యం: ప్రచారసభలో మోడీ

ఎందరో అమరవీరులు కన్న కలల సాకారంకోసం, మార్పు కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో ఆశలతో వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు వందనాలంటూ నరేంద్ర మోడీ ప్రసంగం మొదలుపెట్టారు. 

‘‘హైదరాబాద్ అంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాకు ఆదర్శం. పటేల్ పట్టుదల వల్లే హైదరాబాద్‌ కు విమోచనం కలిగింది. హైదరాబాద్ అనగానే నాకు పటేల్ గుర్తుకొస్తారు. సర్దార్ పటేల్ లేనట్లయితే ఇప్పుడు ఈ స్వేచ్ఛ ఉండేది కాదు. తెలంగాణలో మీతో ఆనందంగా మాట్లాడే అవకాశం కలిగేదే కాదు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన తెలుగు ప్రజలందరికీ నా అభినందనలు’’ అని మోదీ తెలుగులో మాట్లాడారు. 


హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. ఒక వైపు రాహుల్, సోనియాపై ఆరోపణలు చేస్తూనే, మరోవైపు ఇద్దరు చంద్రులపై మాటల తూటాలు పేల్చారు. కుటుంబ పార్టీలన్నింటిపై పాలనకు చరమ గీతం పాడాలని పిలుపు నిచ్చారు నరేంద్ర మోడీ. ఇంకా ఆ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వారసత్వ,  కుటుంబ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకా ఏమన్నారంటే: 
*తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు కాంగ్రెస్‌ పార్టీయే గురువు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీ లు ఒకే నాణేనికి  బొమ్మా బొరుసులాంటి వాళ్లని అభిప్రాయపడ్డారు.

*కాంగ్రెస్‌ -టీఆర్ఎస్ తెలంగాణలో పైకి బద్దశత్రువుల్లా కనిపిస్తున్నా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా రెండు పార్టీల ఆలోచనా ఒక్కటేనన్నారు. యూపీఏ -1 ప్రభుత్వంలో కేసీఆర్‌ కేంద్ర మంత్రి పదవి చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్‌ ఢిల్లీలో సోనియా గాంధీ పాదాలకు సకుటుంబంగా  మొక్కలేదా? అని ప్రధాని ప్రశ్నించారు. 

*ఎవరు ఎవరి జట్టో అందురికీ తెలుసునని, కేసీఆర్, యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది నిజం కాదా?  అని నరేంద్ర మోడీ అన్నారు. టీడీపిలో కేసీఆర్ అప్రెంటిస్ చేశారని, కేసీఆర్ గురువు చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.  


*నాడు తెలుగువారిని అవమానించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, తెలుగు వారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేస్తే, నేడు తమ స్వార్థం కోసం అదే పార్టీని కాంగ్రెస్ పాదాల చెంత పెట్టారు. అందుకే తనకు హైదరాబాద్ వస్తే అభిమానధనుడైన ఆ మహనీయుడే (ఎన్ టీ ఆర్) గుర్తుకు వస్తారు అన్నారు.

*టీఆర్ఎస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయే. తెలంగాణ ఇచ్చింది ఆ కుటుంబం కోసంకాదు. తమ కుటుంబాలు బాగుపడాలనే స్వార్థంతో పనిచేసే పార్టీలకు ఓటేస్తే, రాష్ట్రానికి భవిష్యత్తు ఏముంటుంది? 

*కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే. రెండూ జాతీయ వాదానికి వ్యతిరేకం. రెండూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాయి. రెండు పార్టీలు ఒకే నాణానికి ఉన్న  రెండు ముఖాలు లాంటివారు.
 
*ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందుకు పోరాడారు?  త్యాగాలు ఎందుకు చేశారు? ఉజ్జ్వల భవిష్యత్తు కోసం. కానీ తెలంగాణాను ఒక్క కుటుంబానికి అప్పజెప్పడానికి కాదు. 

*దేశ సమైక్యత కోసం నాటి రాజ్యాంగ నిర్మాతలు మత రిజర్వేషన్లు వ్యతిరేకించారు. అలాంటి మత రిజర్వేషన్లు తీసుకురావడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. 

*టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీ-టీమ్ అంటున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో జేడీఎస్ పార్టీని కూడా బీజేపీకి బి-టీమ్ అన్నారు. కానీ ఎన్నికల తర్వాత ఎవరు ఎవరితో కలిశారు? 


*వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా మీ గొంతు విప్పండి. పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నది ఉజ్వల భవిష్యత్తు కోసమే కానీ, ఒక కుటుంబం చేతిలో పెట్టడానికి కాదు. 

*తెలంగాణలో ఉన్న 5 పార్టీల్లో 4 పార్టీలు కుటుంబాలతోనే నడుస్తున్నాయి.

*దేశంలో బిజెపి 1.25 కోట్ల కుటుంబాల సొంత ఇంటి స్వప్నం సాకారం చేశాం. కానీ, తెలంగాణలో 5000 కుటుంబాలకు మాత్రమే ఇళ్లు ఇచ్చారు. మేము ఇస్తామన్నా తీసుకోక పోవడం పాలకుల అసమర్థతకు నిదర్శనం. 

*తెలంగాణా ప్రజలకు అద్భుత ప్రతిభా సామర్థ్యాలు ఉన్నాయి. కానీ, ఇక్కడి పాలకులు కుటుంబం కోసం పని చేస్తూ యువసంపదను పట్టించుకోవటం లేదు.

*దేశంలో మైనార్టీలకు రక్షణ లేదంటూ కొన్ని పార్టీలు విద్వేషాలు రెచ్చగొట్టేలా చూస్తున్నాయని మండిపడ్డారు. కుర్చీ కోసం దళితులను రెచ్చగొడుతున్నారని మండి పడ్డారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడమంటే అంబేడ్కర్‌ను అవమానించడమేనని అన్నారు.

*నాటి ప్రధాని వాజ్‌పేయీ మూడు కొత్త  రాష్ట్రాలు ఏర్పాటు చేశారని, ఆ రాష్ట్రాలు ఎవరి మధ్య విభేదాలు రాకుండా, ఇప్పుడు అభివృద్ధి వేగంలో దూసుకుపోతున్నాయని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఒక్క రాష్ట్రం  తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.

*కుటుంబ పార్టీలు ఓటు బ్యాంకు కోసం అభివృద్ధిని విస్మరించాయని మధ్యతరగతి ప్రజల కోసం ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదని అంటూ,  2022లోపు ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారం చేయాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు 

*మేడమ్‌ సోనియా గాంధీ రిమోట్‌ కంట్రోల్‌ తో సాగిన పాలన లో సొంతింటి కల సాకారం కాలేదని, పదేళ్ల పాలనలో కేవలం 80000 ఇళ్లు మాత్రమే నిర్మించి ఇచ్చారని చెప్పారు. వారసత్వం, కుటుంబ రాజకీయాలు లేని ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 12,50,000 ఇళ్లు నిర్మించామని స్పష్టం చేశారు. కొత్త ఇళ్లలోనే ప్రజలు దీపావళి వేడుకలు చేసుకున్నారని గుర్తు చేశారు.  

*ఒక కుటుంబం తెలంగాణను లూటీ చేస్తోందని, ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కూడా ఒక కుటుంబం చేతి లోనే చిక్కుకుపోయిందన్నారు. డిసెంబర్‌ 7 తర్వాత వారసత్వ, కుటుంబ పార్టీలు కనుమరుగై పోతాయని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: