వైఎస్‌, చంద్రబాబు, జగన్‌: సీఎంలు మారినా పోలవరం పూర్తవదా?

బ్రిటీష్‌ కాలంలో పోలవరానికి బీజం..
వైఎస్‌ హయాంలో మొదలైన పనులు..
బాబు, జగన్‌ పూర్తి చేయలేకపోయారు..
ఇంకెన్ని ప్రభుత్వాలు మారాలి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది ఓ విచిత్రమైన పరిస్థితి. ఏటా గోదావరి నుంచి వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నా.. వాటిని ఉపయోగించుకోలేని దుస్థితి. ఓవైపు వేల టీఎంసీల నీళ్లు.. మరోవైపు ఎండుతున్న పొలాలు.. నీటి వసతి లేక జరగని పారిశ్రామికాభివృద్ధి.. వీటికి పరిష్కారంగా కనిపించేదే పోలవరం ప్రాజెక్టు. అందుకే ఈ పోలవరం ప్రాజెక్టును ఆంధ్రుల జీవనాడిగా చెబుతుంటారు.

ఎప్పుడో బ్రిటీష్‌ వారి కాలంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ప్రకృతి సహజంగా ఏర్పడిన పాపికొండల కారణంగా పోలవరం వద్ద ప్రాజెక్టు కడితే మొత్తం ఏపీ సస్యశ్యామలం అవుతుంది. వందల కొద్దీ నీరు నిల్వ చేసుకోవచ్చు. మొత్తం ఏపీకి సాగు, తాగు నీరు ఇవ్వొచ్చు. విశాఖ పారిశ్రామిక అవసరాలు తీర్చవచ్చు. ఇంతటి మహత్తర ప్రాజెక్టు మాత్రం.. ఆంధ్రులు ఏనాడు చేసుకున్న పాపం కారణంగానో దశాబ్దాల తరబడి నిర్మాణం సాగుతూనే ఉంది.

బ్రిటీష్‌ కాలంలో బీజం పడిన ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించిన ఘనత మాత్రం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. అయితే ఆయన కాంట్రాక్టుల కోసం కాలువలు మాత్రమే తవ్వాలు.. అసలు ప్రాజెక్టుపై మాత్రం శ్రద్ధ పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యే వరకూ ఈ ప్రాజెక్టులో పురోగతి లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన జాతీయ హోదా హామీ వల్ల పోలవరం నిర్మాణం మళ్లీ ఉపందుకుంది.

జాతీయ హోదా ప్రాజెక్టులను సాధారణంగా కేంద్రమే నిర్మిస్తుంది. అయితే.. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రాజెక్టును వేగంగా కట్టాలి కాబట్టి మేమే నిర్మించుకుంటామని చంద్రబాబు సర్కారు కేంద్రాన్ని ఒప్పించింది. అప్పట్లో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యంగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. అప్పటి నుంచి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించారని టీడీపీ చెప్పుకుంటుంది. ప్రతి వారం సమీక్షలు జరపడం.. ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పోలవరాన్ని వేగంగా నిర్మించామని టీడీపీ అంటుంది.

అయితే పోలవరం లెక్కలు సరిగ్గా ఇవ్వలేదని.. చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని ఆ తర్వాత సాక్షాత్తూ ప్రధాన మంత్రే విమర్శించారు. అంతే కాదు.. ప్రాజెక్టు సగం కూడా పూర్తి కాకుండానే.. ప్రారంభోత్సవాలు చేసి ఎన్నికల్లో లబ్ది కోసం చంద్రబాబు కక్కుర్తి పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. తాము 80 శాతం పూర్తి చేశామని జగన్‌ సర్కారు ఆ కొంచెం కూడా చేయలేకపోయిందని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు.

ఇక జగన్‌ సర్కారు విషయానికి వస్తే.. ఆయనకు ఇది ప్రాధాన్య అంశం కాకుండా పోయింది. దీనికి తోడు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది విపరీతమైన వరదల కారణంగా పోలవరం పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఆ తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ కట్టడంతో గత సర్కారు చేసిన నిర్లక్ష్యం కారణంగా అది కొట్టుకుపోయిందని.. మళ్లీ డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాల్సిందేనని వాదించింది. దీని వల్ల పనుల్లో స్తబ్ధత ఏర్పడింది. అంతే కాకుండా జగన్‌ సర్కారు రాగానే.. పోలవరం కాంట్రాక్టర్లను మార్చడం.. రివర్స్ టెండరింగ్‌ అంటూ హడావిడి చేయడం కారణంగా పనులు నత్తనడకన సాగాయి.

చంద్రబాబు కేవలం ప్రాజెక్టు పనులే చేశారని.. పునరావాసాన్ని పూర్తిగా గాలికొదిలేశారని జగన్‌ సర్కారు విమర్శించింది. తాము పునరావాసం పై దృష్టి పెట్టామని చెబుతోంది. మొత్తానికి ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెడితే.. 2,3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకే టీడీపీ, వైసీపీ.. రెండూ తమ మేనిఫెస్టోలో పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించాయి. మరి ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వమైనా వచ్చే ఐదేళ్లలో పోలవరం పూర్తి చేస్తుందా లేదా అన్నది చూడాలి. మరోసారి పోలవరం ఎన్నికల హామీగా మారే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ, టీడీపీలపై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: