పవన్ కోసం ఆ పార్టీ ఎందుకు అంత పాకులాడుతుంది...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తెలంగాణ లో ఇంత వరకు వ్యవస్థాపక నిర్మాణం కూడా జరగలేదు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఎన్నికల పట్ల అంతగా ఆసక్తి కనపరచడం లేదు. అయితే  తమతో పొత్తులు పెట్టుకోవడానికి సీపీఎం వెంపర్లాడుతుండడం చూసి.. పవన్ కల్యాణ్ కు బహుశా ఆశ్చర్యం కలిగి ఉంటుంది. అందుకే, తమ బలం ఎంతున్నదనే సంగతి విస్మరించి.. కనీసం సీపీఎం వారి ముచ్చట తీర్చడానికైనా పవన్ కల్యాణ్ వారితో జట్టుకట్టి.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కు సారథ్యం వహిస్తూ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటికే రెండు దఫాలుగా జనసేన పొలిటికల్ ఎపైర్స్ కమిటీతో చర్చించారు. పవన్ వస్తే కూటమికి చాలా బలం వస్తుందని.. ఆయన వారికి ప్రతిపాదించారు. అయితే సహజంగానే ఆ కమిటీ సభ్యులు తుదినిర్ణయం చెప్పలేదు. తమ పార్టీ  ‘ప్యాక్’ ద్వారా పవన్ కల్యాణ్ ప్రతిపాదనకు సంబంధించి వివరాలన్నీ తెలుసుకున్నారు. తుది నిర్ణయం తీసుకోవడానికి తాను స్వయంగా సీపీఎం వారితో చర్చించడానికి కూడా నిర్ణయించుకున్నారు.


ఆయన అనుమతించిన అపాయింట్ మెంట్ మేరకు మంగళ లేదా బుధవారాలలో సీపీఎం తమ్మినేని వీరభద్రంతో పవన్ కల్యాణ్ భేటీ జరుగుతుంది. ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి... ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలే ఎక్కువ. ఆ నమ్మకం ఉన్నది గనుకనే... కాంగ్రెస్/సీపీఐ/తెదేపా తరఫునుంచి పొత్తు ప్రతిపాదనలు వస్తే తమ్మినేని ఇదివరకే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. పవన్ ఒప్పుకోకపోతే బహుశా వారు ఆ కూటమిలో చేరుతారు. అంతిమంగా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరి త్రిముఖ పోటీకి వేదికగా నిలిచేలా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: