అటెన్షన్‌ హరీశ్‌రావు: సిద్దిపేట గడ్డపై రేవంత్‌రెడ్డి సింహగర్జన?

Chakravarthi Kalyan
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. హరీశ్‌రావు సొంత గడ్డ సిద్ధిపేటలో రేవంత్‌ రెడ్డి సింహ గర్జన చేశారు. పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు స్వాతంత్ర్యం రాబోతుందన్న రేవంత్‌రెడ్డి.. 45 ఏళ్లుగా మామ, అల్లుడు పాపాల భైరవుల్లా ఈ ప్రాంతాన్ని పట్టీ పీడిస్తున్నారని ఆరోపించారు.
యువకులు, వ్యాపారులు, ప్రజలను పీడిస్తున్న నేత నుంచి.. సిద్దిపేటకు విముక్తి కల్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించిన రేవంత్.. రాజీనామా లేఖ సిద్ధం చేసుకోవాలని హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు.

సిద్దిపేటకు మళ్లీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తానని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. అక్రమంగా భూములు గుంజుకుని ఫాంహౌజ్‌లు కట్టుకున్న వారికి ఎందుకు ఓటేయాలంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూపాయి విలువ చేసే పనులివ్వలేదని సీఎం రేవంత్‌ దుయ్యబట్టారు. విభజన హామీలు అమలు సహా మెట్రో విస్తరణ పనులకు సహకరించలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అదానీకి భూములు దోచిపెట్టేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ దిల్లీలో వందలాది మంది రైతులు బలయ్యారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.

బీజేపీకు మద్దతిస్తే సంక్షోభ పరిస్థితులు వస్తాయని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. మల్కాజిగిరి ప్రజల ఆశీర్వాదంతోనే ఎంపీగా గెలిచి... అంచెలంచెలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ పాలనలో వంద రోజుల్లోనే అనేక హామీలు అమలు చేసినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. పట్నం సునీతా రెడ్డిని లక్ష మెజారిటితో గెలిపించాలని కుత్బుల్లాపూర్‌ ప్రచారంలో ఓటర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ పగలు వేర్వేరు పార్టీల్లా కనిపించినా.. రాత్రికి మాత్రం రెండూ ఒకటేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అంటున్నారు. యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ అటకెక్కినా... మోదీ, అమిత్‌షాకు మాత్రం కొలువులు దక్కాయని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో రేవంత్‌ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: