బెజ‌వాడలో ఆ పార్టీ లీడ‌ర్ల‌ త‌ప‌స్సు..!

VUYYURU SUBHASH
బెజ‌వాడ‌! రాజ‌కీయాల‌కు పుట్టినిల్లు! ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన అనేక మంది నేతలు రాజ‌కీయాల్లో త‌ల‌మానికంగా ఎదిగిన తీరు నేటి త‌రానికే కాదు.. రాబోయే కొన్ని త‌రాల‌కు కూడా మేలు మ‌లుపులు! అయితే, ఇక్క‌డ ఎదిగిన నాయ‌కులు దాదాపు అంద‌రూ.. కూడా కాంగ్రెస్ కు చెందిన వారే. అయ్య‌దేవ‌ర కాళేశ్వ‌ర‌రావు మొద‌లుకుని, భోగ‌రాజు ప‌ట్టాభి సీతారామ‌య్య, ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర వంటి కీల‌క నాయ‌కులు విజ‌య‌వాడ కేంద్రంగానే రాజ‌కీయాలు చేశారు. క‌మ్యూనిస్టు కురు వృద్ధులు, దిశానిర్దేశ‌కులు సైతం బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఎదిగిన వారే. అలాంటి బెజ‌వాడ‌లో ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి?  ఒక‌ప్పుడు ఎవ‌రిని నిల‌బెట్టినా.. పార్టీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కేవారు. కానీ, నేడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. కాదు, కాదు, నేడు పార్టీ జెండా ప‌ట్టుకునే నాథుడే క‌రువ‌య్యారు. 


నిన్న‌టికి నిన్న పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా ఇటీవ‌ల నియ‌మితులైన ఊమెన్ చాందీ.. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు వ‌చ్చిన సంద‌ర్భంలో బెజ‌వాడలో మ‌న ప‌రిస్థితి ఏంట‌ని ఆయ‌న విమానాశ్ర‌యంలోనే నాయ‌కుల‌ను ప్ర‌శ్నించారు. ఎందుకంటే.,. ఊమెన్ చాందీ గ‌తంలో వైఎస్ ఉన్న‌ప్పుడు కూడా ఏపీలో కీల‌క రోల్ పోషించారు. ఈ సంద‌ర్భంలోనే ఆయ‌న బెజ‌వాడ పై అత్యంత మ‌క్కువ ప్ర‌ద‌ర్శించారు. బెజ‌వాడ‌ను కాపాడుకుంటే.. ఏపీని కాపాడుకున్న‌ట్టే అని ఆయ‌న అప్ప‌ట్లోనే చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తొలి ప‌ర్య‌ట‌న‌ను కూడా విజ‌య‌వాడ‌లోనే ఏర్పాటు చేసుకున్నారు. 


అయితే, నేడు బెజ‌వాడ‌లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు లేక‌, స‌రైన నాయ‌క‌త్వం లేక.. ఈసురో మంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. విభ‌జ‌న ఎఫెక్ట్‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన కాంగ్రెస్‌.. బెజ‌వాడ‌లో మాత్రం ఓట్ల శాతంలో ప్ర‌ధాన పార్టీల‌కు ఒకింత మెరుగ్గానే వ్య‌వ‌హ‌రించింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఎంపీగా దేవినేని నెహ్రూ వార‌సుడు అవినాష్ పోటీ చేయ‌గా.. ఆయ‌న‌కు 70 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. నిజానికి అప్ప‌టి ప‌రిస్థితిలో ఈ ఓట్లు చాలా గ్రేట్ అనేది కాంగ్రెస్ నాయ‌కుల మాట‌. ఇక‌, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన మ‌ల్లాది విష్ణుకు కూడా మంచి ఓట్లే ప‌డ్డాయి. అయితే, ఈ హ‌వాను కొన‌సాగించ‌డంలోను, ఓట్ల శాతం పెంచుకోవ‌డం లోనూ బెజ‌వాడ కాంగ్రెస్ నాయ‌కులు తీవ్రంగా విఫ‌ల‌మ‌య్యారు.


దీంతో ఇప్పుడు ఊమెన్ చాందీ విజ‌య‌వాడలో కాంగ్రెస్‌కు పున‌రుజ్జీవం క‌ల్పించ‌డంపై దృష్టి పెట్టారు. అయితే, ఇదేమంత తేలిక విష‌యం కాద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. పోయిన వారు పోయినా.. ఉన్న నేత‌ల్లోనూ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌గ‌లిగిన స‌త్తా లేక‌పోవ‌డం ప్ర‌ధాన లోపంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా మాస్‌లో ఉన్న కాంగ్రెస్ ఇమేజ్‌ను తిరిగి సాధించుకోవడంలోనూ నేత‌లు విఫ‌ల‌మ‌వుతున్నారు. కొన్నాళ్లుగా వారు చేస్తున్న నిల‌క‌డ లేని ప్ర‌క‌ట‌న‌లు కూడా పార్టీని న‌ష్ట‌ప‌రుస్తున్నాయి. త‌మ‌కు ప్ర‌ధాన శ‌త్రువు జ‌గ‌నేన‌ని, వైసీపీని తాము మ‌ట్టి క‌రిపిస్తామ‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెప్పిన నాయ‌కులు ఇప్పుడు అనూహ్యంగా త‌మ‌కు టీడీపీనే ప్ర‌ధాన శ‌త్రువుగా పేర్కొంటున్నారు. ఇలా పొంత‌న‌లేని వ్యాఖ్య‌ల‌తో వారు ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారు. ఇక‌, ప్ర‌త్యేక హోదా మేమే ఇస్తామ‌ని చెబుతున్నా.. కాంగ్రెస్‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. మొత్తంగా బెజ‌వాడ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి వెంటిలేట‌ర్‌పైనే ఉండ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: