వైసీపీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసిన స్థానాల్లో ఉపఎన్నికలకు టిడిపి సిద్ధం - బాబు

ప్రత్యేక ప్రతిపత్తి హోదా కోసం వైసీపీ సభ్యులు రాజీనామా చేసిన పార్లమెంట్ స్థానాల్లో ఉపఎన్నికలు వచ్చే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ వినియోగించు కోవటానికి నిరీక్షిస్తుంది. అదేవిషయాన్ని ముఖ్యమంత్రి  చంద్రబాబు ప్రకటించారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఆదివారం ‘కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామం’ లో నీరు ప్రగతి–ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అనే అంశంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారాయన.  జొన్నగిరి గ్రామంలోని చెరువుకు జలహారతి ఇచ్చి హంద్రీ–నీవా ప్రాజెక్టు నుంచి పత్తికొండ, ఆలూరు, డోన్‌ నియోజకవర్గా ల్లోని 68చెరువులను నీటితో నింపే కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో, ఈ నెల 5న వైసీపీ ఎంపీలు స్పీకర్‌తో సమావేశమైన తరువాత రాజీనామాల ఆమోదం పై స్పష్టత వస్తుందన్నారు. ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదింపజేసుకొని ఎన్నికలకు సిద్ధపడాలని వారిని చాలంజ్ చేశారు అంతేకాదు వారు ‘ఉప ఎన్నికలు రాకుండా చేస్తారని కూడా ఆరోపించారు. 
2019 ఎన్నికల్లో బీజేపీ పాత్రధారులను, సూత్రధారులను ఓడించి తమకు 25మంది ఎంపీలను ఇవ్వాలని ప్రజలను ఆయన సభాముఖంగా అభ్యర్ధించారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ నిధులు ఇవ్వడం లేదని సీఎం ఆరోపించారు. ఇప్పటికి 55శాతం పనులు పూర్తిచేశామని, 2019డిసెంబర్‌లోపు మిగిలిన 45 శాతం పూర్తిచేస్తా మన్నారు.  కాగా, 2019ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో “ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర” అని, అందులో మరోసారి “టీడీపీ చక్రం తిప్పుతుంది” అని ఆయన నొక్కి వక్కాణిన్చారు.

తనపై అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని తన గత ప్రన మిత్రుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు హితవు పలికారు. ఇదిలా ఉంటే, ఉపాధి కూలీలు, రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. “మీరు మళ్లీ నాకు ఓట్లు వేయాలి! అందరికీ చెప్పి వేయించాలి!” అని చంద్ర బాబు వారితో అనగా, “మీకు కాకుండా మరెవరికి వేస్తాం సార్‌!” అంటూ కూలీలు, రైతులు బదులిచ్చారు. “మీరు అలానే అంటారు, పదేళ్లు పక్కన పెట్టారు. మిమ్మల్ని నమ్మను” అంటూ తన అక్కసును వెళ్లగక్కారు సీఎం.

ఆ తర్వాత జొన్నగిరి లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీఎం పర్యటించారు. అక్కడ ప్రజల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. తన కుమారుడికి రెండు కళ్లు లేక పోయినా జన్మభూమి కమిటీ సభ్యులు దరఖాస్తు తీసుకోవడం లేదని ఓ తల్లి,   తన పింఛన్‌ దరఖాస్తు కూడా తీసుకోవడంలేదని 80 ఏళ్ల వెంకటమ్మ, ఫిర్యాదు చేయడంతో సీఎం ఖంగుతిన్నారు. కాగా, ముఖ్యమంత్రి కార్యక్రమానికి మంత్రి భూమా అఖిలప్రియ, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి గైర్హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: