కన్నడ కోటపై కమల వికాసం..! కొనసాగుతున్న బీజేపీ దండయాత్ర..!!

Vasishta

కర్నాటకలో కమలం వికసించింది. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలనుకున్నట్టుగా.. ఎక్కడైతే తన ప్రాభవాన్ని కోల్పోయిందో అక్కడే ప్రభంజనం సృష్టించింది. 2008లో దక్షిణాదిలో తొలిసారి అధికారం దక్కినా 2013లో దాన్ని వివిధ కారణాలతో పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి ఏమాత్రం తప్పుచేయకుండా కర్నాటకను కమలం కబ్జా చేసింది.


          కర్నాటకలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ విజయఢంకా మోగించింది. హంగ్ ఏర్పడుతుందని మెజారిటీ సర్వేలు తేల్చినా.. వాటన్నింటినీ పటాపంచలు చేసింది బీజేపీ. కర్నాటకలో అధికారానికి అవసరమైన మెజారిటీ సాధించి మరొకరి అవసరం లేకుండానే పాలనాపగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తూ దండయాత్ర చేస్తున్న బీజేపీకి దక్షిణాదిలో విజయం చాలా కీలకం. ఇప్పుడు కర్నాటకలో విజయం సాధించడం ద్వారా సౌతిండియాలో మళ్లీ కాలు మోపింది బీజేపీ.


          మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కర్నాటకలో 222 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇందులో 113 స్థానాలు గెలుచుకుంటే అధికారం చేపట్టేందుకు అవకాశముంటుంది. ఆ నెంబర్ క్రాస్ చేయడం ద్వారా బీజేపీకి అధికారం దక్కింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న బీజేపీ.. కర్నాటకలో కూడా అదే నినాదంతో హోరెత్తించింది. నాలుగేళ్లుగా సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ కర్నాటకను ఏలింది. ఎన్నికలు జరిగే వరకూ సిద్ధరామయ్యకు మంచి మార్కులే పడ్డాయి. ఆయన పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో ఈసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని అందరూ భావించారు. అయితే ఆ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి.


          కర్నాటక ఎన్నికల్లో బీజేపీ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్లింది. గతంలో చేసిన తప్పులను పునరావృతం కానీయకుండా జాగ్రత్తపడింది. బీజేపీ నుంచి వెళ్లిపోయిన యెడ్యూరప్పను మళ్లీ పార్టీలో చేర్చుకుని అతడినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు నిలబెట్టింది. యెడ్యూరప్ప, గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ పై ఎన్ని అవినీతి అక్రమాల ఆరోపణలున్నా ఈ ఎన్నికల్లో వారికే అత్యధిక ప్రయారిటీ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. కేంద్రంలో అధికారంలో ఉండడం కర్నాటకలో ఆ పార్టీకి కలిసొచ్చింది. ఒక్క మైసూర్ ఏరియాలో తప్ప మిగిలన ప్రాంతాల్లో బీజేపీ హవా నడిచింది.


          కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించినా వారి అంచనాలు తలకిందులయ్యాయి. మెజారిటీకి కాస్త అటోఇటో సీట్లు కచ్చితంగా వస్తాయని కాంగ్రెస్ నేతలు భావించారు. అదే పరిస్థితి వస్తే జేడీఎస్ లాంటి వారితో కలిసి గవర్నమెంట్ ఫాం చేయవచ్చనుకున్నారు. అయితే ఆ ఛాన్సే దక్కలేదు కాంగ్రెస్ పార్టీకి. అంచనాలకు ఏమాత్రం అందని రీతిలో 70 స్థానాలకంటే తక్కువకు పడిపోయింది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా జేడీఎస్ బాగా పుంజుకుంది. సుమారు 40 స్థానాల్లో జేడీఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ముఖ్యంగా ఓల్డ్ మైసూర్, బెంగళూరు ఏరియాల్లో ఆ పార్టీ హవా నడిచింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజారిటీ రాకపోతే తామే కింగ్ మేకర్ అనుకున్న జేడీఎస్ కు ఆ ఛాన్స్ దక్కలేదు. బీజేపీకి క్లియర్ కట్ మెజారిటీ రావడంతో జేడీఎస్ అవసరం లేకుండా పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: