కర్నాటకలో ‘గాలి’వాటం చూపించిన బీజేపీ..!!

Vasishta

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇక్కడ గెలిచి సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. ఇందుకోసం ఆ పార్టీ అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఒకప్పుడు కళంకితులుగా భావించి పక్కన పెట్టినవారిని ఇప్పుడు దరి చేర్చుకుని ఆదరిస్తోంది. కర్నాటకలో గాలి ఎపిసోడ్ అలాంటిదే. అవినీతిపరుడుగుగా పేరొందిన గాలి జనార్థన్ రెడ్డి లాంటివారిని ఎందుకు చేరదీస్తామని ఎదురు ప్రశ్నించిన అమిత్ షా... అదే గాలి వర్గానికి మొత్తం సీట్లు కట్టబెట్టారు.


గాలి జనార్దన్‌రెడ్డి.. ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కర్ణాటకలో బీజేపీ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన గాలి జనార్దన్‌రెడ్డి ప్రాభవం అవినీతి కేసులతో, జైలు-బెయిల్ వ్యవహారాలతో మసకబారింది. అలాంటి గాలి జనార్ధన్‌రెడ్డి తాత్కాలికంగా జైలు నుంచి బయటికొచ్చాక నోట్ల రద్దుతో దేశ ప్రజలంతా ఏటీఎంల్లో డబ్బు దొరక్క అల్లాడుతుంటే.. కూతురు పెళ్లిని వందల కోట్లతో ఘనంగా చేసి వార్తల్లో నిలిచారు. అవినీతి కేసులతో రాజకీయాలకు దూరమైన గాలి.. కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీలో మళ్లీ కీలకంగా మారారు.


అక్రమంగా ఇనుప గనులను తవ్వి వేల కోట్లు కూడబెట్టారన్న ఆరోపణలపై కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పెద్ద పీట వేసింది. ఆయన వర్గానికి చెందిన వారిలో తొమ్మిది మందికి అవకాశం కల్పించింది. బళ్లారి నగర టిక్కెట్‌ను జనార్దన్‌రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, బళ్లారి రూరల్ నుంచి రాయచూరు మాజీ ఎంపీ సణ్ణ పక్కీరప్ప, హగరి బొమ్మనహళ్లిలో నేమ రాజనాయక్‌, హూవినహడగలిలో చంద్రనాయక్‌, కంప్లిలో సురేష్‌బాబుకు బీజేపీ టిక్కెట్లు దక్కాయి.


సిరుగుప్ప మాజీ శాసనసభ్యుడు సోమలింగప్పకూ మళ్లీ టిక్కెట్‌ దక్కింది. ఈయన 2008లో గాలి వర్గం తరఫున గెలుపొందినా.. అనంతరం వారితో అంటీముట్టనట్లుగా వ్యవహరించేవారు. గాలి స్నేహితుడు, ప్రస్తుత బళ్లారి ఎంపీ బి.శ్రీరాములును చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ విషయమై ఇప్పటికే స్థానిక శాసనసభ్యుడు తిప్పేస్వామి నుంచి ఆయనకు ప్రతిఘటన ఎదురైంది. రాయచూరు జిల్లా దేవదుర్గ ప్రస్తుత శాసనసభ్యుడు శివన్నగౌడ గతంలో జేడీఎస్‌ నుంచి శాసనసభ్యుడిగా గెలుపొంది తర్వాత కాలంలో బీజేపీలో చేరి గాలి వర్గంలో కలసిపోయారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో గాలి రాయచూరు, బళ్లారి, కొప్పళ జిల్లాల్లో ఓ వెలుగు వెలిగారు. 2013లో ఈ జిల్లాల్లో ఆ వర్గానికే ఎక్కువ శాతం టిక్కెట్లు కేటాయించారు. ఇప్పుడు కూడా అదే మళ్లీ రిపీట్ అయింది.


గాలి జనార్దన్‌రెడ్డి ప్రభావం బీజేపీ టిక్కెట్ల కేటాయింపులో స్పష్టంగా కనిపించింది. అయితే.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కర్ణాటకలో పర్యటించినపుడు గాలి జనార్దన్‌రెడ్డికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కర్ణాటకలో బీజేపీకి ప్రధాన పోషకుడిగా ఉన్న గాలి జనార్ధన రెడ్డి పేరు ఎత్తడమే తనకు ఇష్టం లేదన్నట్టుగా అమిత్ షా మాట్లాడారు. అమిత్ షా వ్యవహారశైలితో గాలి జనార్థన్‌ రెడ్డి, ఆయన వర్గం డీలా పడింది. అమిత్‌షా గాలితో సంబంధం లేదని తేల్చి చెప్పేయడంతో.. గాలి జనార్దన్‌రెడ్డి కొత్తదారులు వెతుక్కున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి గాలి జనార్దన్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు పుకార్లు షికారు చేశాయి.


అయితే చివరకు వచ్చే సరికి మాత్రం గాలి బీజేపీలో తన పట్టును మళ్లీ నిరూపించుకున్నారు. నిజానికి బీజేపీ ఎంపీలు శాసనసభ ఎన్నికల బరిలో దిగేందుకు ప్రయత్నించినా.. కుదరదని చెప్పిన అధిష్ఠానం.. గాలికి అత్యంత సన్నిహితుడైన బళ్లారి ఎంపీ శ్రీరాములుకు మాత్రం మినహాయింపునివ్వడం గమనార్హం. గాలి జనార్దన రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డికి టిక్కెట్ ఇవ్వడానికి భారతీయ జనతాపార్టీ నిరాకరించినట్లుగా తొలుత చాలా వార్తలు వచ్చాయి. తీరా టికెట్ల కేటాయింపు వ్యవహారం పూర్తయ్యేసరికి టికెట్ల కేటాయింపులో అగ్రపూజ అందుకుంటున్నది గాలి జనార్ధన రెడ్డి వర్గం మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: