సంచలనం : నాడు ఎన్టీఆర్.. నేడు పవన్..! మరో ఆత్మగౌరవ పోరాటం తప్పదా..?

Vasishta

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే బలిదానానికి సిద్ధమని ప్రకటించారు. అమరజీవి పొట్టిశ్రీరాములు వంటి మహానీయుడి స్ఫూర్తితో హోదా కోసం ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమన్నారు జనసేనాని.. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు పోరాటం ఆగదన్నారు పవన్ కళ్యాణ్..


గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడతానని.. దీనికోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదని.. నాయకులే ప్రజల తరపున పోరాడాలన్నారు. హామీలు అమలుకాకపోతే ఆమరణ దీక్ష చేయడానికి సైతం వెనుకాడబోనని.. తాను బలిదానానికి సిద్ధమంటూ ప్రకటించారు.


అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యలపై పవన్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయం రగిలిస్తోందని.. వేధిస్తోందని పవన్ చెప్పారు. సెంటిమెంట్‌తో ప్రత్యేక హోదా రాదంటూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని.. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయరా అని ప్రశ్నించారు. మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోనప్పుడు.. మీ చట్టాలను మేమెందుకు పాటించాలన్నారు. తమ హక్కుల కోసం ఢిల్లీలో జంతర్‌ మంతర్‌లో పోరాటం చేయబోమని.. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై చేస్తామని జనసేనాని ప్రకటించారు.  అవినీతిపరులు, తప్పుచేసిన వారు కేంద్రానికి భయపడతారేమో కాని.. తమకు ఎటువంటి భయంలేదని చెప్పారు.


విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే బలిదానానికి వెనుకాడబోమన్నారు. ఆంద్రప్రదేశ్ వాళ్లంటే.. పౌరుషం, ఆత్మగౌరవం కలవారని.. హక్కులు సాధించుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.. తెలుగువాడి తెగింపు.. ఆంధ్రుడి ఆత్మగౌరవం ఎలా ఉంటుందో.. కేంద్రానికి రుచిచూపిస్తామని చెప్పారు. అమరజీవి పొట్టిశ్రీరాములును స్ఫూర్తిగా తీసుకుని.. హక్కుల సాధన కోసం పోరడతామన్నారు పవన్..


విభజన హామీలు అమలుచేయకపోతే ఆమరణదీక్ష చేపడతామంటూ పవన్ చేసిన ప్రకటన తీవ్ర సంచలనం రేపుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కూడా ఆమరణ దీక్షతో అప్పటి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అదే రీతిలో పవన్ కూడా ఆమరణ దీక్షకు రెడీ అనడంతో.. హోదా పోరు మరింత ఉధృతం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: