చింతమనేనీ.. నీకెందుకంత కోపం..?

Vasishta

చింతమనేని ప్రభాకర్.. ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ కూడా..! అయితేనేం.. నిత్యం ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు ఈగల్లా వాలుతుంటాయి. దీంతో ఆయన వార్తల్లో నలుగుతూ ఉంటారు. తాజాగా ఆయనకు శిక్ష పడడం, బెయిలు రావడం కూడా జరిగాయి. దీంతో.. ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.


వివాదాలకు చింతమనేని కేరాఫ్ గా నిలుస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనో ఫైర్ బ్రాండ్. ఎక్కడ పంచాయితీ ఉన్నా ఆయన తానున్నానంటారు.. నిత్యం దూకుడు ప్రదర్శించే ఈ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు షాక్‌ ఇచ్చింది. 2011లో మంత్రిగా పనిచేసిన వట్టి వసంతకుమార్‌పై దాడి చేసిన కేసులో నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధించింది న్యాయస్థానం.


2011లో దెందులూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌, అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్‌ మధ్య వివాదం తలెత్తింది. ఈ ఘటనలో చింతమనేని ప్రభాకర్‌ తనపై దాడి చేశారంటూ దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో వట్టి వసంత కుమార్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చింతమనేనిపై కేసు నమోదు చేశారు. ఏడేళ్ల పాటు కేసు విచారించిన భీమడోలు న్యాయస్థానం చింతమనేని ప్రభాకర్‌ దాడికి పాల్పడటం నిజమేనని తేల్చింది. 


చింతమనేని ప్రభాకర్ కు భీమడోలు కోర్టు శిక్ష ఖరారు చేసిన వెంటనే.. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే కోర్టు చింతమనేని ప్రభాకర్ కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఒక మంత్రిపై ఎమ్మెల్యే దాడికి దిగటం అప్పట్లో సంచలనం రేపింది. మొత్తం మీద  ఏడేళ్ల పాటు కోర్టు విచారణ అనంతరం తీర్పునిచ్చింది.


చింతమనేని ప్రభాకర్ ఆగడాలు అన్నీఇన్నీ కావు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన సంఘటన సంచలనం కలిగించింది. కొన్ని నెలలపాటు ఈ వివాదం కొనసాగింది. చివరకు సద్దుమణిగింది. కేవలం అధికారులే కాదు.. పబ్లిక్ ప్రాబ్లమ్స్ ను అక్కడికక్కడే సాల్వ్ చేస్తుంటారు ప్రభాకర్. ఇందుకోసం పోలీసులు, అధికార యంత్రాంగంతో పని ఉండదు. ఆయన చెప్పిందే వేదం.. అన్నట్టు ఆయన బిహేవియర్ ఉంటుంది. అందుకే ఆయన చుట్టూ నిత్యం వివాదాలు చుట్టుముడుతుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: